కాంగ్రెస్‌లో కీలక బీసీ నేతల టికెట్లకు అడ్డుపడుతున్నదెవరు?
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న బీసీ నాయకులను తప్పించే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం.
బీసీలకు భారీగా టికెట్లు కేటాయిస్తాం. బహుజనులకు కాంగ్రెస్‌లోనే గుర్తింపు ఉంటుందంటూ ఆ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ పలు మార్లు బహిరంగంగానే ప్రకటించారు. కానీ తెలంగాణ ఎన్నికల విషయంలో మాత్రం బీసీలకు తగిన న్యాయం జరగటం లేదని పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు దరఖాస్తులు చేసుకున్న నాటి నుంచే బీసీ నాయకులకు పోటీగా ఇతర సామాజిక వర్గాల అభ్యర్థులను ఒక కీలక నేత రంగంలోకి దింపినట్లు తెలుస్తున్నది.
టీపీసీసీలో కీలకంగా ఉన్న నాయకుడే బీసీ నాయకుల టికెట్లకు ఎసరు పెడుతున్నట్లు తెలుస్తున్నది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న బీసీ నాయకులను తప్పించే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. ఆయా బీసీ నేతలకు టికెట్లు దక్కి.. గెలిస్తే.. భవిష్యత్‌లో తనకు అడ్డు వస్తారనే అనుమానంతోనే వారిని నెమ్మదిగా పక్కన పెట్టే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయం ముందుగానే గ్రహించిన బీసీ నాయకులు తెరపైకి 34 సీట్ల డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. అధిష్టానం వరకు వెళ్లి తమ డిమాండ్లను అగ్రనాయకత్వం ముందు పెట్టారు.
కాగా, తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక వ్యక్తి, స్క్రీనింగ్ కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్న ఒక 'రెడ్డి' సామాజిక నాయకుడు వారికి టికెట్లు దక్కకుండా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌లో కీలక బీసీ నాయకులుగా ఉన్న పొన్నం ప్రభాకర్, మధు యాష్కి గౌడ్, సురేశ్ షట్కర్, అంజన్ కుమార్ యాదవ్, ఎడవల్లి కృష్ణ తదితరుల టికెట్లకు ఎసరు పెట్టేందుకు ముందు నుంచే ఆ నేత ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. హుస్నాబాద్‌లో పొన్నంకు టికెట్ దక్కుండా అక్కడే అలిగిరి ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తికి టికెట్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఎల్బీనగర్‌లో మధు యాష్కికి టికెట్ రాకుండా ఆయన నాన్ లోకల్ అనే స్లోగన్‌ను స్వయంగా కాంగ్రెస్ కీలక నాయకుడే ప్రచారంలో పెట్టినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
బీసీ నాయకులు భవిష్యత్‌లో తన 'పెద్ద కల'కు అడ్డు తగులుతారనే అనుమానంతోనే ముందస్తుగానే వారిని అసెంబ్లీ బరి నుంచి పక్కకు పెట్టడానికి తీవ్రమైన కసరత్తు చేసినట్లు తెలిసింది. అందుకే బీసీ నాయకులు లోక్‌సభ పరిధిలో 2 సీట్లు బీసీలకు ఇవ్వాలనే బలమైన డిమాండ్ తెచ్చారు. సదరు కీలక నాయకుడు ఏ విధంగా తమ నియోజకవర్గాల్లో ఇతర సామాజిక వర్గానికి చెందిన వారిని తెచ్చి పెట్టాడో కూడా అధిష్టానానికి వివరించినట్లు తెలిసింది. అయితే, సదరు కీలక నాయకుడి విషయంలో అధిష్టానం కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొన్నది. ఇప్పుడు ఆ నాయకుడిని టికెట్ల ఎంపికలో పక్కన పెట్టలేని పరిస్థితి ఉండటంతోనే చాకచక్యంగా బుజ్జగింపుల కమిటీ పేరుతో జానారెడ్డిని ముందు పెట్టినట్లు సమాచారం.
మరోవైపు టికెట్ల కోసం సదరు కీలక నాయకుడు కోట్లు దండుకున్నట్లు కూడా మీడియాలో ప్రచారం జరుగుతోంది. తన అనుచరుల పేరుతో అధిష్టానం వద్ద డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే బీసీ నాయకులను పక్కన పెట్టడం కూడా పార్టీకి భారీ నష్టం అని తెలుసుకొని.. సాధ్యమైనంత వరకు ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చే అవకాశం ఉన్నది. జానారెడ్డి బృందం తొలి టాస్క్ బీసీ నాయకులతో సయోధ్యే అని పార్టీలో కూడా చర్చ జరుగుతున్నది.