మునుగోడులో సగం విజయం సాధించిన టీఆర్ఎస్..

రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారే కానీ, స్థానికంగా కాంగ్రెస్ కి అండగా నిలిచిన నాయకుల్ని బీజేపీలోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. కానీ, టీఆర్ఎస్ మునుగోడు ఇన్ చార్జి గా ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి మాత్రం ఈ విషయంలో సక్సెస్ అయ్యారు.

Advertisement
Update:2022-08-23 17:10 IST

మునుగోడు ఉప ఎన్నికకు ఇంకా షెడ్యూల్ విడుదల కాలేదు, అసలింకా టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించలేదు, అప్పుడే సగం విజయం ఏంటా అనుకుంటున్నారా..? అవును, ఇది నిజం.. మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా, టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా.. ఇప్పటికే ఆ పార్టీ సగం విజయం సాధించినట్టయింది. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి ఇప్పటికే సగం మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ లో చేరారు. మిగతా సగం మంది ఈరోజో రేపో అంటున్నారు. టీఆర్ఎస్ సంస్థాగత బలం వీటికి అదనం. సో.. ఎన్నిక ఎప్పుడొచ్చినా విజయం తమదేననే ధీమాలో ఉన్నారు టీఆర్ఎస్ నేతలు.

మునుగోడు నియోజకవర్గ పరిధిలో 71 ఎంపీటీసీ స్థానాలకు 31 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 159 సర్పంచ్ స్థానాల్లో 57 చోట్ల కాంగ్రెస్ బలపరచినవారు గెలిచారు. టీఆర్ఎస్ 38 ఎంపీటీసీలు, 88 మంది సర్పంచ్ లను గెలిపించుకుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్ నాయకులు దిక్కుతోచనివారిగా మారిపోయారు. ఇన్నాళ్లూ కనీసం ఎమ్మెల్యే ఉన్నారనే ధైర్యంతో వారు ప్రతిపక్షంలో ఉన్నా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ఇప్పుడిక ఎమ్మెల్యే అండలేదు, ఎమ్మెల్యేతోపాటు బీజేపీలోకి వెళ్లినా అది కూడా ప్రతిపక్షమే, రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నికలో ఓడిపోతే, అప్పుడు పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. అందుకే వారంతా అధికార పార్టీవైపు మళ్లారు, తెలివైన నిర్ణయం తీసుకున్నారు.

రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారే కానీ, స్థానికంగా కాంగ్రెస్ కి అండగా నిలిచిన నాయకుల్ని బీజేపీలోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. కానీ, టీఆర్ఎస్ మునుగోడు ఇన్ చార్జి గా ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి మాత్రం ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. ఎంపీటీసీలు, సర్పంచ్ లను గులాబి గూటికి చేర్చారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా విజయం టీఆర్ఎస్ దేనని సర్వేలు చెబుతున్నాయని.. అయితే అదనంగా కాంగ్రెస్ ఎంపీటీసీలు, సర్పంచ్ లతో తమ బలం పెరిగిందని, సీపీఐ సపోర్ట్ తో మరింత లాభం చేకూరుతుందని అంటున్నారు జగదీష్ రెడ్డి.

రాజగోపాల్ హడావిడి అంతా మీడియాలోనే..

రాజగోపాల్ రెడ్డి మీడియా, సోషల్ మీడియా ప్రమోషన్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని, ఎన్నికల తర్వాత ఆయన్ని అందరూ మరచిపోతారంటున్నారు జగదీష్ రెడ్డి. క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ విజయం ఖాయమైపోయిందని ధీమాగా చెబుతున్నారు మంత్రి. నాయకుడిని చేర్చుకుని, కార్యకర్తల్ని వదిలేసిన బీజేపీకి ఉప ఎన్నికలో మూడో స్థానమే దిక్కవుతుందని జోస్యం చెప్పారు.

Tags:    
Advertisement

Similar News