స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ఎప్పుడు?
సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి ఇంకెంత కాలం పడుతుందని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కులగణన పూర్తి చేసి రిజర్వేషన్లు పెంచుతామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇంకా రిజర్వేషన్ల పెంపు అమలుకు నోచుకోలేదన్నారు. గురువారం ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆమె బహిరంగ లేఖ రాశారు. ఏటా రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో బీసీల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అరకొర కేటాయింపులతోనే సరిపెట్టారని అన్నారు. తద్వారా కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌కు తూట్లు పొడిచారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంపై బీసీల్లో విశ్వాసం సన్నగల్లిందని.. సీఎం వైఖరితో బీసీలు అన్యాయానికి గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సర్వే వివరాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే డెడికేటెడెట్ కమిషన్ నివేదిక కూడా సిద్ధమైనట్టుగా వార్తలు వస్తున్నాయని.. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతుందో ప్రకటించాలన్నారు. గ్రామ పంచాయతీల్లో ఏడాదిగా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోందని.. అయినా బీసీ రిజర్వేషన్లు పెంచి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నట్టు అనిపించడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు ప్రభుత్వం ముందుకు రాకుంటే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించారు.