పోడు భూముల పట్టాల పంపిణీ ఆలస్యానికి కారణం ఏంటి ?

పోడు భూముల పంపిణీకి సంబంధించి వచ్చిన దరఖాస్తుల్లో విస్మయ పరిచే నిజాలు అటవీ అధికారుల పరిశీలనలో వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 4, 14, 453 మంది 12,46,846 ఎకరాల పోడుభూములకు పట్టాల కోసం దరఖాస్తు చేసుకోగా, అటవీ అధికారుల దర్యాప్తులో 80 శాతం మంది అనర్హులన్న విషయం తేటతెల్లమైంది.

Advertisement
Update:2022-12-02 12:07 IST

దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న, గిరిజనుల ఎన్నో యేండ్ల కల అయిన‌ పోడు భూములకు పట్టాల పంపిణీ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి ముందుకు వచ్చింది. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అర్హులైన గిరిజనులకు పోడుభూములకు సంబంధించి పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా రాష్టంలోని పోడు భూముల వివరాలను సేకరించాలని, అర్హులైన వారి నుండి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

అయితే.. పోడు భూముల పంపిణీకి సంబంధించి వచ్చిన దరఖాస్తుల్లో విస్మయ పరిచే నిజాలు అటవీ అధికారుల పరిశీలనలో వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 4, 14, 453 మంది 12,46,846 ఎకరాల పోడుభూములకు పట్టాల కోసం దరఖాస్తు చేసుకోగా, అటవీ అధికారుల దర్యాప్తులో 80 శాతం మంది అనర్హులన్న విషయం తేటతెల్లమైంది. దీనితో అర్హులైన గిరిజనులకు పోడు పట్టాలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం మరింత ఆలస్యమయ్యేలా కనపడుతోంది. పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో సగానికి పైగా గిరిజనేతరులు కావడం గమనార్హం.

ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏమిటంటే.. పోడు భూముల పట్టాల పంపిణీకి సంబంధించి.. అటవీ హక్కుల చట్టం 2005 కు లోబడి పట్టాల పంపిణీ జరుగుతుంది. దీనిప్రకారం ఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీకి ముందు నుండే గిరిజనలు ఆ భూములను సాగు చేస్తుండాలి. గిరిజనేతరులు అయితే చట్టం అమల్లోకి రావడానికి 75 యేండ్ల ముందు నుండీ ఆ భూములను సాగు చేస్తుండాలి. అధికారులు చెప్తున్న ప్రకారం... వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే మెజారిటీ దరఖాస్తుదారులు 3 నుండి 4 యేండ్ల క్రితం నుండే ఆ భూములను సాగు చేస్తున్నట్లు తెలిసింది. మరికొంతమంది సాగు చేయబట్టి సంవత్సరం కూడా కాలేదు. ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే దాదాపు 80 శాతం మందికి పైగా అనర్హులున్నట్లు అటవీ శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మరొకొన్ని దరఖాస్తులను పరిశీలిస్తే సాగుచేయని భూమికి సైతం దరఖాస్తు చేసుకోవడం అధికారులను విస్మయపరుస్తోంది.దీనివల్ల పోడు భూములకు పట్టాలివ్వడంలో ఆలస్యం అవుతోందని అధికారులు చెప్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News