పరకాల కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? టికెట్ కోసం ఐదుగురి పోటీ!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ములుగు, భూపాలపల్లి, నర్సంపేట, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు.

Advertisement
Update:2023-10-17 18:07 IST

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 55 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. ఇక మిగిలిన స్థానాలకు ఒకే సారి ప్రకటిస్తారా లేదంటే రెండు విడతల్లో అభ్యర్థులను ఖరారు చేస్తారా అనే విషయంపై ఉత్కంఠత నెలకొన్నది. ఇంకా టికెట్లు ప్రకటించని స్థానాల్లో పోటీలో దిగడానికి కాంగ్రెస్ తరపున పోటీ భారీగా ఉంది. తమకే టికెట్ దక్కేలా అధిష్టానం వద్ద లాబీయింగ్ కూడా చేస్తున్నారు. పలు కీలక నియోజకవర్గాల్లో ఒకరి కంటే ఎక్కువ మంది బలమైన అభ్యర్థులు ఉండటంతో ఎవరికి టికెట్ వస్తుందా అనే ఆసక్తి నెలకొన్నది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ములుగు, భూపాలపల్లి, నర్సంపేట, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇక మిగిలిన 8 స్థానాలకు రెండో విడతలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నది. ఆయా నియోజకవర్గాల్లో ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా పరకాల నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక కసరత్తు కత్తిమీద సాములాగా మారింది.

పరకాల నియోజకవర్గం అభ్యర్థిత్వంపై రోజుకో పేరు బయటకు వస్తుండటం కాంగ్రెస్ శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నది. 2014లో టీడీపీ నుంచి చల్ల ధర్మారెడ్డి గెలిచారు. 2018లో బీఆర్ఎస్ టికెట్‌పై ధర్మారెడ్డి రెండో సారి విజయం సాధించారు. ఇక మూడో సారి ఆయన గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. 2014, 2018లో చల్ల ధర్మారెడ్డిపై వేర్వేరు అభ్యర్థులు ప్రత్యర్థులుగా ఉన్నారు. 2014లో కాంగ్రెస్ తరపున ఇనగాల వెంకట్రామిరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో వరంగల్ పశ్చిమ నుంచి వలస వెళ్లిన కొండా సురేఖ పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

కొండా సురేఖ మరోసారి వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్నే నమ్ముకున్నారు. అయితే పరకాల నుంచి పోటీకి ఇనగాల వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే వీరు టికెట్ ప్రయత్నాల కోసం ఢిల్లీకి పలుమార్లు వెళ్లివచ్చారు. తాజాగా మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కూడా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. ఇక ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. మొత్తానికి కాంగ్రెస్ తరపున ఐదుగురు బలమైన నాయకులు టికెట్లు ఆశిస్తున్నారు.

నర్సంపేటకు చెందిన రేవూరి ప్రకాశ్ రెడ్డి సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరక పోయినా.. పార్టీ తరపున టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్న రేవూరి.. రేపు ములుగులో రాహుల్ పర్యటన సందర్భంగా పార్టీలో చేరతారనే చర్చ జరుగుతున్నది. పరకాల టికెట్ హామీతోనే కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీ అయినట్లు తెలుస్తున్నది.

నర్సంపేట నియోజకవర్గం నుంచి దొంతి మాధవరెడ్డికి టికెట్ కన్ఫార్మ్ అయ్యింది. దీంతో రేవూరి వేరే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో పరకాల టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నట్లు తెలుస్తున్నది. అయితే, అకస్మాతుగా తెరపైకి వచ్చిన రేవూరికి టికెట్ ఇస్తే.. మిగిలిన నలుగురి పరిస్థితి ఏమిటనే చర్చ జరుగుతోంది.

బీసీలకు పరకాల టికెట్ కేటాయించాలని పలువురు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన కొండా మురళీ, ఇటీవలే పార్టీలో చేరిన గాజర్ల అశోక్‌లు తమకు బీసీ కోటాలో అవకాశం వస్తుందనే ఆశ పెట్టుకున్నారు. అయితే కుటుంబంలో రెండు టికెట్లు ఇస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే మైనంపల్లి కుటుంబంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబలో రెండేసి టికెట్లు ఇచ్చారు. దీంతో తమకు కూడా రెండు టికెట్లు వస్తాయని కొండా దంపతులు ఆశ పెట్టుకున్నారు. అయితే రేవంత్ రెడ్డి తన సన్నిహితుడైనా రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది.

గాజర్ల అశోక్‌కు టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఆయనకు పరకాల ఇవ్వకపోయినా.. పాలకుర్తి నుంచి అడ్జెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మావోయిస్టు పార్టీలో దళ కమాండర్‌గా వర్దన్నపేట, పాలకుర్తి, జనగామ, చేర్యాల, స్టేషన్‌ఘన్‌పూర్ ప్రాంతాల్లో అశోక్ పని చేశారు. ఆయనకు ఆ ప్రాంతంలోని గ్రామాల్లోని ప్రజలతో పరిచయాలు ఉన్నాయి.ఈ కారణంగానే పరకాల కాకుండా పాలకుర్తి నుంచి బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది.

Tags:    
Advertisement

Similar News