రేవంత్ నీకు దమ్ముంటే 15 నెలల పాలనపై అసెంబ్లీలో చర్చ పెట్టు
తల్లిలాంటి రాష్ట్రాన్ని క్యాన్సర్ అన్న దుర్మార్గుడు సీఎం.. : కేటీఆర్
రేవంత్ రెడ్డికి దమ్ముంటే 15 నెలల ఆయన పాలనపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ తలకిందలుగా తపస్సు చేసినా, రాహుల్ గాంధీ వంద భారత్ జోడో యాత్రలు చేసినా రాష్ట్రాన్ని కేసీఆర్ స్థాయిలో అభివృద్ధి చేయలేరని అన్నారు. శనివారం తెలంగాణ భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దివ్యంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం రేవంత్ పాలనలో దివాళా తీసిందన్నారు. తెలంగాణ ఆర్థికప్రగతిపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమన్నారు. కన్నతల్లి లాంటి రాష్ట్రాన్ని క్యాన్సర్ తో పోల్చిన దుర్మార్గుడు రేవంత్ అన్నారు. కృష్ణాజలాల్లో న్యాయమైన వాటా కోసం కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నిస్తే తన ఉద్యోగం పోతుందన్న భయంలో రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు. తెలంగాణ ఆర్థిక ప్రగతిపై ముఖ్యమంత్రి రేవంత్ మూతి మీద తన్నెటట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వాస్తవాలు చెప్పారన్నారు. తెలంగాణ అప్పులపై రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్దాలే అని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే స్టేట్ స్టాటిస్టికల్ అట్లాస్ నివేదికలో ఒప్పుకుందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి నుంచి మొదలుపెడితే ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఒక ఎజెండా ప్రకారం గోబెల్స్ వారసుల్లాగా తెలంగాణ ఆర్థిక ప్రగతిపై దుష్ప్రచారం చేస్తున్నరని అన్నారు. రాష్ట్రం దివాలా తీసింది అని రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెప్పాడు. రేవంత్ రెడ్డి లాంటి దివాలా కోరు ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరూ లేరన్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాలను తిప్పికొడుతూ, సమగ్రమైన నివేదిక ఇచ్చినందుకు భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడి ముఖ్యమంత్రి తెలంగాణ పరువు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు మంచి పేరు వస్తుందని తెలుసుకుని వెబ్‌సైట్ నుంచి రిపోర్టును డిలీట్ చేశారన్నారు. తలసరి ఆదాయంలో 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో 10వ స్థానంలో ఉందని, 2023 నాటికి తలసరి ఆదాయంలో భారత దేశంలోనే నంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉందని ఈ నివేదిక చెప్తుందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో సంపద ఎలా పెరిగింది ? ఎలా అభివృద్ధిలో పురోగమించింది.. ఎలా దేశానికి ఆదర్శంగా మారిందో ఈ నివేదిక స్పష్టం చేసిందన్నారు. తెలంగాణ దివాలా తీసింది అని దివాలాకోరు మాటలు మాట్లాడిన సన్నాసుల నోర్లు మూయించే విధంగా ఈ నివేదిక వాస్తవాలను బయటపెట్టిందన్నారు.
తలసరి ఆదాయంలో మాత్రమే కాదు జీడీపీలో దేశానికి కాంట్రిబ్యూటర్ గా దేశానికి ఏ విధంగా అన్నం పెడుతుందో ప్రగతిశీల విధానాలతో, కులం మతం పంచాయతీలు లేకుండా తెలంగాణ ఎలా పురోగమించిందో , ఎట్లా సంపద సృష్టించిందో ఈ నివేదిక తెలియజేస్తుందన్నారు. 2013 -14 లో దేశ జీడీపీలో తెలంగాణ వాటా నాలుగు శాతంగా ఉంటే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి అది 5.1 శాతానికి పెరిగిందన్నారు. మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దానికంటే మనమే ఈ దేశానికి రెట్టింపు ఆదాయాన్ని ఇస్తున్నామన్నారు. ఆర్‌బీఐ నివేదిక ప్రకారం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పది సంవత్సరాల కాలంలో స్టేట్ ఓన్డ్ టాక్స్ రెవెన్యూలో భారతదేశంలోనే 88శాతం సొంత ఆదాయంతో కేంద్రం మీద ఆధారపడకుండా తెలంగాణ అగ్ర భాగాన నిలబడిందని గుర్తు చేశారు. ఈ నివేదిక ప్రకారం జీఎస్‌డీపీలో తెలంగాణ స్థానం 2014లో ఐదు లక్షల కోట్లు అన్నారు. ఆర్థిక మంత్రి విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ రాష్ట్రం జీఎస్‌డీపీ కేసీఆర్ రూ.5 లక్షల కోట్లనుంచి రూ.15 లక్షల కోట్లకు పెంచారన్నారు. జీఎస్‌డీపీలో గుజరాత్ కన్నా మెరుగైన తెలంగాణ ఉందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై చిల్లర మాటలు, బజారు మాటలు మాట్లాడిన వారికి ఈ నివేదికలో స్పష్టమైన సమాధానం ఉందన్నారు. కాళేశ్వరం ,మిషన్ కాకతీయ, రైతుబంధు లాంటి సంక్షేమ పథకాలతోనే సంపద పెరిగిందని ఈ నివేదిక చెబుతుందన్నారు. 2014లో 68 లక్షల టన్నుల వడ్లు పండితే కేసీఆర్ దిగిపోయే నాటికి 2.60 కోట్ల టన్నుల వడ్లు పండాయన్నారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ పథకాలు తెలంగాణలో వ్యవసాయ విస్తరణకు దోహద పడ్డాయో లేదో ఈ గణాంకాల ద్వారానే తెలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాటికి ఐటీ ఎగుమతులు రూ.57 వేల కోట్లు ఉంటే 2023 నాటికి రూ.2.41 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. ఐటీ ఉద్యోగులు 3.23 లక్షల నుంచి 10 లక్షల మందికి పెరిగారన్నారు. బీసీలను బలోపేతం చేయడానికి కేసీఆర్ చేపట్టిన చర్యలను కాంగ్రెస్ నాయకులు తక్కువ చేసి మాట్లాడారని.. ఈరోజు షీప్ ప్రొడక్షన్‌తో పాటు జీవ సంపదలో దేశంలోనే నంబర్ వన్‌గా తెలంగాణ నిలిచిందన్నారు. కేసీఆర్ హయాంలో అన్ని రంగాల్లో తెలంగాణ పురోగమించిందని తెలిపారు. దేశ జనాభాలో తెలంగాణ జనాభా 2.8 శాతమైతే.. దేశ సంపదకు 5.1 శాతం ఆదాయం మన రాష్ట్రం ఇస్తుందన్నారు. ఇకనైనా రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రగతిపై రంకెలు వేయడం మానేసి దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని, తన పాలనపైనా చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.
ఆరు గ్యారంటీలు సహా ఏ ఒక్క హామీని ఈ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసిన తర్వతే రేవంత్ వాళ్లను ఓట్లడగాలన్నారు. లోన్లు కట్టడం లేదని రైతుల స్టార్టర్లు, మీటర్లు, డోర్లు ఎత్తుకుపోతున్నారు.. రేపు ఆడబిడ్డల పుస్తెలతాడు కూడా రేవంత్ ఎత్తుకుపోతాడన్నారు. బండి సంజయ్ రక్షణ కవచంలో రేవంత్ రెడ్డి ఉన్నాడని అన్నారు. రేవంత్ ఆర్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని ప్రధాని ఆరోపణలు చేశారని.. బండి సంజయ్ కు దమ్ముంటే దీనిపై విచారణ చేయించాలన్నారు. అమృత్ స్కాం టెండర్లలో అక్రమాలపై కేంద్రానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రేవంత్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎందుకు కాపాడుతుందో చెప్పాలన్నారు. ''ఏదో అడ్డి మార్ గుడ్డి దెబ్బ లెక్కలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు.. ఇప్పటికైనా కేసీఆర్ ను దూషించడం మానేయ్. ప్రజల కోసం మంచిగా పని చెయ్.. తెలంగాణలో ఎవరు తిట్టినా.. తెలంగాణని ఎవరు దూషించినా.. తెలంగాణ ఎవరు తక్కువ చేసినా అంతే గట్టిగా సమాధానం ఇస్తాం. ఢిల్లీ పార్టీలకు తెలంగాణను పరిపాలించడం చేతకాలని ఈరోజు తేలిపోయింది.. సన్నాసులకు పరిపాలన చేతన ఇవ్వడం లేదని అర్థమవుతుంది.. దివాలాకోరు కాంగ్రెస్ ను నమ్మిన పాపానికి రాష్ట్రానికి చిప్ప చేతికి ఇచ్చారు.. మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని అప్పజెప్తే రూ.1.40 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు..'' అన్నారు.
రేవంత్ తిక్క నిర్ణయాలు, హైడ్రా లాంటి దిక్కుమాలిన విధానాలతో మాత్రమే రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయిందన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో రూ.18 వేల కోట్లు వస్తాయి అనుకుంటే రూ.5 వేల కోట్లు కూడా రాలేదన్నారు. రేవంత్ రెడ్డి ఆస్తులు ఆదాయం పెరుగుతుంది కాని రాష్ట్రం ఆదాయం పడిపోతుందన్నారు. రాజకీయపరమైన కక్షలు సెటిల్మెంట్ లు తెలుసు కాని రాష్ట్రాన్ని డెవలప్ చేసే సోయి లేదన్నారు. మేడిగడ్డను ఎండబెట్టడంతో ఈరోజు భూగర్భ జలాలు తగ్గిపోయి వ్యవసాయరంగంలో సంక్షోభం ఏర్పడిందన్నారు. కేసీఆర్ మీద కోపంతో నల్లగొండ చివరి ప్రాంతాలకు నీళ్లు అందకుండా చేసి పంటలు ఎండబెడుతున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ''తన చేతగానితనంతో కేవలం ఒక్క సంవత్సరంలోనే అన్ని రంగాలను రేవంత్ రెడ్డి సావు దెబ్బ కొట్టిండు.. ఇది రాష్ట్ర ఆర్థిక లోటు కాదు.రేవంత్ రెడ్డి వల్ల వచ్చిన తలపోటు.. రాష్ట్రంలో కొత్త నిర్మాణాల పైన ఒక్క స్క్వేర్ ఫీట్ కి 150 రూపాయలు వసూలు చేస్తున్నారు.. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి తెలంగాణ దివాలా తీస్తుందని ఒకటే తీరుగా ప్రచారం చేసిండు.. ముఖ్యమంత్రి మంత్రులు తెలంగాణ నాశనమైందని చెప్తూ వస్తున్నారు.. తన సొంత రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చిందని చెప్పిన దివాళా కోరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కడే..'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.