ఎంఐఎంలో ఏం జరుగుతోంది.. ఆ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు?
పాత నగరం పరిధిలోని నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలను మార్చాలని భావిస్తోంది. ఇందులో ఒక ఎమ్మెల్యేకు అసలు టికెట్ ఇవ్వకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
మరో నెల రోజుల్లో తెలంగాణ పోలింగ్ జరుగనున్నా.. ఏఐఎంఐఎం ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. పాత నగరంలో గట్టి పట్టు ఉన్న ఎంఐఎం పార్టీకి కనీసం 7 సీట్లు గ్యారెంటీ అని అందరూ భావిస్తున్నారు. గతంలో కంటే సీట్లు పెంచుకునే అవకాశాలపై కూడా ఓవైసీ బ్రదర్స్ దృష్టిపెట్టారు. అయితే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడం ఇప్పుడు దారుస్సలాం వర్గాలను కలవరపెడుతోంది. పాత నగరం పరిధిలోని నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలను మార్చాలని భావిస్తోంది. ఇందులో ఒక ఎమ్మెల్యేకు అసలు టికెట్ ఇవ్వకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
సీనియర్ నాయకుడు, చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ విషయంలో ఇప్పుడు పార్టీ తీవ్రంగా ఆలోచిస్తున్నది. చార్మినార్ ఎమ్మెల్యేగా ఉంటూ అవినీతికి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా ఎమ్మెల్యే అవినీతిపై భారీగా చర్చ జరుగుతోంది. 2018 ఎన్నికల సమయంలో కూడా యాకుత్‌పురా ఎమ్మెల్యేగా ఉన్న అహ్మద్.. అవినీతి ఆరోపణలు ఎదుర్కున్నారు. ఈ క్రమంలోనే ఆయనను యాకుత్‌పురా నుంచి చార్మినార్‌కు మార్చారు. తిరిగి ఇక్కడ కూడా ఇవే ఆరోపణలు రావడంతో పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోంది.
ఈ సారి ఎన్నికల నుంచి తప్పుకోవాలంటూ స్వయంగా అక్బరుద్దీన్ వెళ్లి ముంతాజ్‌కు చెప్పినట్లు తెలుస్తున్నది. చార్మినార్ నుంచి కొత్త అభ్యర్థిని ప్రకటిస్తామని కూడా చెప్పారు. అయితే సీనియర్ ఎమ్మెల్యే అయిన ముంతాజ్ అహ్మద్ అంగీకరించలేదని తెలుస్తున్నది. ఒక వేళ తాను బరిలో లేకుంటే.. కనీసం తన కుటుంబం నుంచి ఒకరికి టికెట్ కేటాయించాలని పట్టుబట్టినట్లు సమాచారం. అయితే ఓవైసీ బ్రదర్స్ మాత్రం ఇంకా ఆ విషయంపై ఎలాంటి హామీ ఇవ్వలేదు.
ముంతాజ్ అహ్మద్ లేదా ఆయన కుటుంబానికి టికెట్ ఇవ్వకపోతే పార్టీని వీడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. అవసరం అయితే కాంగ్రెస్ లేదా ఎంబీటీ నుంచి టికెట్ కోరాలని కూడా ఆయన నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు చార్మినార్ నుంచి కాంగ్రెస్ టికెట్ మస్కతికి ఇస్తారనే వార్తలు వస్తున్నాయి. మొదట్లో చార్మినార్ నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించినా.. ప్రస్తుతానికి ఆయన సైలెంట్ అయ్యారు.
మరోవైపు ముంతాజ్ అహ్మద్ కనుక పార్టీని వీడితే చార్మినార్ నుంచి ఓవైసీ కుటుంబం నుంచి ఒకరు పోటీకి దిగే అవకాశాలు కూడా తెలుస్తున్నాయి. అక్బరుద్దీన్ కుమారుడు నూర్ ఉద్దీన్ ఓవైసీని బరిలోకి దించే విషయంపై ఓవైసీ కుటుంబం తీవ్రంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ముంతాజ్ అహ్మద్ విషయంలో పార్టీ కాస్త కఠినంగానే వ్యవహరించబోతున్నట్లు సమాచారం. మరోవైపు యాకుత్‌పుర ఎమ్మెల్యేను కూడా పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రిని ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ఆయనకు విశ్రాంతి ఇవ్వాలని ఎంఐఎం భావిస్తోంది. ఇందుకు అహ్మద్ పాషా కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తున్నది.