మేడారంలో ఏం జరుగుతోంది!
మొన్ననేలకూలిన 50 వేల చెట్లు .. నేడు భూప్రకంపనలు
ప్రకృతి వైపరీత్యాలకు మేడారం అటవీ ప్రాంతం కేంద్ర బిందువుగా మారింది. మేడారానికి ఏమైంది? ప్రకృతి పగబట్టిందా? భూకంపం నేపథ్యంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. వరుసగా ప్రకృతి ప్రకోపాలు దేనికి సంకేతం అన్న ఆందోళన నెలకొన్నది.ఈ ప్రాంతంలో జరుగుతున్న వరుస సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. బుధవారం ఉదయం 7.27 గంటల సమయంలో జరిగింది. మేడారం సమ్మక్క-సారక్క గద్దెల వద్ద కంపించిన భూమి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని జిలా కేంద్రంతో పాటు మహాముత్తారం, కాటారం, మహదేవ్‌పూర్, పలిమెల, మొగుళ్లపల్లి, చిట్యాల మండలాల్లోని పలు గ్రామాల్లో బుధవారం పొద్దున 2 సెకన్ల పాటు స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బైటికి పరుగులు తీశారు. ములుగు నుంచి 50 కిలోమీటర్లు ఈశాన్యం వైపు ఏటూరు నాగారం భూకంప కేంద్రంలో రిక్టర్ స్కేల్‌పై 5 తీవ్రతగా భూకంపం నమోదైందని వరంగల్ కాకతీయ వర్సిటీ జియాలజీ విభాగాధిపతి ఆర్ మల్లికార్జున రెడ్డి తెలిపారు. గతంలో 1969, 2018లో కొత్తగూడెం, భద్రాచలంలో భూ ప్రకంపనలు వచ్చాయని వెల్లడించారు. భూకంపాలకు సంబంధించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు మూడో జోన్ కిందికి వస్తాయన్నారు.
వరుసగా జరుగుతున్న సంఘటనలతో ములుగు జిల్లా ప్రజల్లో ఆందోళన వ్యక్తమౌతున్నది. ఈ ఏడాది ఆగస్టు 31న మేడారం ప్రాంతంలో భారీ వర్షంతో పాటు టోర్నడో తరహా బలమైన ఈదురు గాలులు వీచాయి. సుమారు 50 వేల చెట్లు నేలకూలాయి. ఏటూరు నాగారం నుంచి మేడారం మీదుగా తాడ్వాయి మండలం గోనెపల్లి వరకు దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలో ఈ నష్టం జరిగింది. ఇప్పుడు అదే ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించడంతో ఆ ఘటనతో దీనికి ఏమైనా సంబంధం ఉన్నదా? అనే కోణంలో చర్చ జరుగుతున్నది. అయితే వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులకు, భూ ప్రకంపనలకు సంబంధం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 55 ఏళ్ల తర్వాత మళ్లీ ఇంత తీవ్రస్థాయిలో భూకంపాలు సంభవించాయని ఎన్‌జీఆర్‌ఐ రిటైర్డ్ సైంటిస్ట్ నగేశ్ తెలిపారు. ముగులు జిల్లాలో ఏర్పడిన టెక్టోనిక్ ఎర్త్ క్వేక్‌గా పరిగణించవచ్చు అన్నారు. దీని ఫలితంగా ఆఫ్టర్ షాక్స్ (చిన్న చిన్న ప్రకంపనలు) వచ్చే అకాశాలున్నాయని తెలిపారు. కానీ వాటి తీవ్రత ప్రస్తుత ప్రకంపనల కంటే తక్కువగానే ఉంటుందన్నారు. సెసిమిక్ జోన్ మ్యాప్‌నకు అనుగుణంగా కట్టడాలు నిర్మిస్తే 6 తీవ్రతో భూకంపం సంభవించినా నిర్మాణాలు కూలిపోయే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం సంభవించిన భూకంపం ఒక రిమైండర్ అని పేర్కొన్నారు. సెసిమిక్ జోన్ మ్యాప్‌నకు అనుగుణంగా నిర్మాణాలు ఉంటేనే మున్సిపల్ అధికారులు అనుమతులు ఇవ్వాలని సూచించారు
భూ ప్రకంపనలపై తెలంగాణ విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ వివరణ ఇచ్చారు. ములుగు జిల్లా మేడారం వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చెప్పారు. భూమికి 40 కి.మీ లోతులో ప్రకంపనలు వచ్చాయన్నారు. భూకంప కేంద్రం ఎక్కువ లోతులో ఉన్నందున తీవ్ర తక్కువగా ఉందని చెప్పారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు.