'ఏక్‌ పోలీస్‌' హామీ ఏమైంది?

బెటాలియన్‌ పోలీస్‌ కుటుంబాల సభ్యుల సచివాలయం ముట్టడి ఉద్రిక్తం

Advertisement
Update:2024-10-25 14:30 IST

సచివాలయం సమీపంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బెటాలియన్‌ కానిస్టేబుల్‌ భార్యలు, కుటుంబసభ్యులు సచివాలయ ముట్టడికి వచ్చారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రికత్తలు నెలకొన్నాయి. కొన్ని రోజులుగా జిల్లాల్లో కొనసాగుతున్న బెటాలియన్‌ పోలీస్‌ కుటుంబాల ఆందోళనలు హైదరాబాద్‌కు వ్యాపించాయి. బెటాలియన్‌ పోలీస్‌ కుటుంబాల సభ్యులు సచివాలయం ముట్టడికి యత్నించారు. సెక్రటేరియట్‌ ముందు బెటాలియన్‌ కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఒకే దగ్గర విధులు నిర్వర్తించేలా అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరితో తాము ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏక్‌ పోలీస్‌ హామీ ఏమైందని ప్రశ్నించారు. తమ కుటుంబ సభ్యుల బాధలను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.

అందరి పోలీసుల్లాగే తమ భర్తలు కూడా పరీక్షలు రాసి, ఫిజికల్‌ టెస్టుల్లో పాసై, 9 నెలల కఠోర శిక్షణ తీసుకున్నవారే. వాళ్లకెందుకు మిగతా సివిల్‌, ఏఆర్‌ పోలీసుల్లాగా ఒకే చోట డ్యూటీ వేయరు? వాళ్లను కట్టుకున్న పాపానికి మేమేం తప్పు చేశాం? అంటూ బాధిత బెటాలియన్‌ కానిస్టేబుళ్ల భార్యలు ప్రభుత్వాన్ని నిలదీశారు. మా భర్తలు ఏడాదికి మూడు జిల్లాలు తిరగాల్సి వస్తున్నది. మేము ఎక్కడ ఉండాలి? మా బిడ్డలు ఎక్కడ చదువుకోవాలి? చేసేది పోలీసు ఉద్యోగమైనా ఈ తిరుగుడేంది? అని ప్రశ్నించారు. పోలీసు ఉద్యోగం చేస్తున్న తమ భర్తలను తోటి పోలీసులే జీతగాండ్లలాగా చూస్తున్నారని వాపోయారు. పొద్దున్నే పలుగు, పారలతో గడ్డి పీకిస్తున్నారని కన్నీటి పర్వంతమయ్యారు. రాష్ట్రంలో సివిల్‌, ఏఆర్‌ పోలీసుల మాదిరిగానే బెటాలియన్‌ పోలీసులకు వారు కోరుకున్న జిల్లాలో కనీసం 3-5 ఏండ్లు ఒకే చోట పనిచేసే వెసులుబాటు కల్పించాలని డిమాండ్‌ చేశారు. దీనివల్ల తమ పిల్లల చదువులకు అంతరాయం లేకుండా ఉంటుందని, ఉద్యోగ భారం తగ్గుతుందన్నారు.

Tags:    
Advertisement

Similar News