ఏడాది కాలంలో తెలంగాణ ఏం చూసింది ?
12 నెలల ప్రత్యక్ష నరకం అంటూ రేవంత్ సర్కార్ ఏడాది పాలనపై బండి ఎక్స్ వేదికగా సెటైర్
రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ఏడాది పాలనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. '12 నెలల నరకం' అంటూజనవరి నుంచి డిసెంబర్ వరకు కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి వివిధ మీడియాల కథనాల క్లిప్‌లను దానికి జత చేశారు.
ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న ఫ్రీ బస్సుపై తాము ఇబ్బందులు, ఆటో నడకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల ఆక్రందనలు, రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక దందా గురించి పేర్కొన్నారు. వంద శాతం రుణమాఫీ పూర్తి చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది. అయితే రుణమాఫీ కాని రైతులు రోడ్లపైకి ఎక్కిన విషయాన్ని బండి గుర్తు చేశారు. కాంగ్రెస్ ఏలుబడి గుక్కెడు నీటి కోసం హైదరాబాద్ ప్రజలు అల్లాడుతున్నారనే వార్త, కాంగ్రెస్ వచ్చింది కరెంటు కోతలు మొదలయ్యాయని ఎద్దేవా చేశారు. అలాగే గంజాయి అమ్మకాలు, సిరిసిల్లలో నేత కార్మికుల బలవన్మరణాలు, హైడ్రా పేరుతో హైడ్రామా నడిపిస్తున్నదని, మూసీ నిర్వాసితుల ఆందోళనలు, విద్యార్థులకు సరైన ఆహారం ఇవ్వకపోవడంతో అస్వస్థతకు గురవుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మోసాల పాలనకు ఏడాది అంటూ ఆరోపించారు.
'రైతుల రోదనలు, ఆటోవాలాల ఆత్మహత్యలు, ఆడబిడ్డల ఆక్రందనలు, నిరుద్యోగుల నిరాశ, నిస్పృహలు, పసి పిల్లల అన్నంలో పురుగులు, హైడ్రాతో అరాచకాలు, మూసీతో మూటలు నింపే ప్రణాళికలు, కాంట్రాక్టర్ల దోపిడీ కథలు, నీటిమూటలైన మాటలు' అంటూ ఏం చూసింది ఏడాది కాలంలో తెలంగాణ? 12 నెలల ప్రత్యక్ష నరకం తప్ప అని సెటైర్ వేశారు.