ఉప ఎన్నికలంటే అవేనా సంజయ్?

బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి, ఉప ఎన్నికలు ముంచుకొస్తున్నాయి, తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ సరిగ్గా వారం రోజుల కిందట ఊదరగొట్టారు బండి సంజయ్.

Advertisement
Update:2022-08-11 17:25 IST

బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి, ఉప ఎన్నికలు ముంచుకొస్తున్నాయి, తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ సరిగ్గా వారం రోజుల కిందట ఊదరగొట్టారు బండి సంజయ్. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని స్టేట్ మెంట్లు ఇచ్చారు. కట్ చేస్తే ఇప్పుడు టీఆర్ఎస్ లోకి ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారాయన. నేను తలచుకుంటే ఉప ఎన్నికలు వస్తాయని సవాళ్లు విసిరిన బండి సంజయ్, టీఆర్ఎస్ లో ఉన్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని, బయటకొచ్చి కొట్లాడాలని అంటున్నారు. ఇదెక్కడి లాజిక్కో ఆయనకే తెలియాలి.

తెలంగాణలో రెండు ఉప ఎన్నికల్లో గెలిచి ఇద్దరు ఎమ్మెల్యేలను అదనంగా పొందింది బీజేపీ .అసలు ఎన్నికల్లో గెలిచిన ఒక ఎమ్మెల్యే కంటే, కొసరుగా ఉప ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలే ఆ పార్టీలో ఎక్కువ. అంతమాత్రాన ఆ పార్టీ వచ్చే దఫా అధికారంలోకి వచ్చేస్తామనుకోవడం భ్రమ అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. జీహెచ్ఎంసీ పరిధిలో సీట్లు వచ్చినంత మాత్రాన, మొత్తం రాష్ట్రమంతా బీజేపీ హవా ఉందనుకోవడం వారి అవివేకం అని కామెంట్లు చేస్తున్నారు. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, కాంగ్రెస్ ఊపు తగ్గడంతో తెలంగాణలో టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బీజేపీయే అనే ప్రచారం బలపడుతోంది.

మునుగోడు చాలదా..?

2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్, టీడీపీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా అధికార టీఆర్ఎస్ లో చేరారు. వారంతా రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. అయితే బీజేపీ మాత్రం తమ పార్టీలో చేరాలనుకునేవారు మాత్రం రాజీనామా చేయాలని కోరుతోంది. అందుకే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే కాషాయ బ్యాచ్ లో కలసిపోతున్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ బలం పెద్దగా లేకపోయినా స్థానికంగా కోమటిరెడ్డి కుటుంబానికి ఉన్న ఇమేజ్ తో మునుగోడు కైవసం చేసుకోవాలనుకుంటోంది బీజేపీ. హుజురాబాద్ లో కూడా ఈటల వర్గమే ఆయన్ను గెలిపించింది కానీ, బీజేపీ బలం కాదు. ఇప్పుడు మునుగోడుతోపాటు, మరిన్ని ఉప ఎన్నికలు వస్తే సత్తా చూపిస్తామంటున్నారు బండి సంజయ్. అయితే ఆ రాజీనామాలన్నీ ఫిరాయింపు ఎమ్మెల్యేలవి కావాలనుకోవడమే విచిత్రం. నిజంగా బీజేపీతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికిప్పుడు పార్టీ మారాలనుకోరు, ఉప ఎన్నికలను కోరుకోరు. అందుకే బండి సంజయ్.. ఫిరాయింపుదారులంటూ కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు. వారం క్రితం బండి సంజయ్ సవాళ్లు విసిరినట్టు గుంపగుత్తగా తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదని మాత్రం ఇప్పుడు తేలిపోయింది.

Tags:    
Advertisement

Similar News