కేంద్రం ద్రోహం చేసినా తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు ఆగలేదు, ఆగబోవు... కేటీఆర్

కోవిడ్ మహమ్మారి కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి లక్ష కోట్ల రూపాయల నష్టం వాటిల్లినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని కేటీఆర్ ఆరోపించారు. రాముడు ఎవరు, రాక్షస రాజు రావణుడు ఎవరు అనేది ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు.

Advertisement
Update:2023-04-11 06:40 IST

కేంద్ర బీజేపీ సర్కార్ తెలంగాణ పై వివక్ష చూపించినా, ద్రోహం చేసినా, కనీసం సహకరించకపోయినా తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు ఎన్నడూ నిలిచిపోలేదు, నిలిచిపోబోవు అని తెలంగాణ పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్ మహమ్మారి కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి లక్ష కోట్ల రూపాయల నష్టం వాటిల్లినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. రాముడు ఎవరు, రాక్షస రాజు రావణుడు ఎవరు అనేది ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని కేటీఆర్ అన్నారు.

మిడ్‌మానేరు రిజర్వాయర్‌లో 350 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న ఆక్వాహబ్‌లో చీర్లవంచ గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

''గత ఎనిమిదేళ్లలో వినూత్న పథకాలను ప్రవేశపెట్టి యావత్ దేశానికే తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచింది. రైతు బంధు పథకం కింద 65 లక్షల మంది రైతులకు 65 వేల కోట్ల రూపాయలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుంటే, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించేలా కేంద్రం రాష్ట్రంపై ఒత్తిడి తెచ్చింది.'' అని కేటీఆర్ మండి పడ్డారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గరిష్ట విద్యుత్ డిమాండ్ 13,117 మెగావాట్లు ఉండగా, ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే 16,000 మెగావాట్లుగా ఉందని కేటీఆర్ తెలిపారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, ఎస్టీ రిజర్వేషన్‌ కోటాను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. గిరిజన ఆవాసాలను గ్రామ పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేయడం ద్వారా గిరిజనుల చిరకాల స్వప్నాన్ని కూడా ముఖ్యమంత్రి నెరవేర్చారన్నారు.

Tags:    
Advertisement

Similar News