నష్టపోయిన రైతులను ఆదుకుంటాం.. ఎకరాకు రూ.10 వేల సాయం : సీఎం కేసీఆర్
ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారంగా అందజేస్తామని అన్నారు. కౌలు రైతులకు కూడా ఈ నష్టపరిహారాన్ని వర్తింప జేస్తామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.
అకాల వర్షాల కారణంగా పంటలను నష్టపోయిన రైతులను ఓదార్చి, వారికి భరోసా కలిగించడానికి సీఎం కేసీఆర్ గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రామాపురం వెళ్లి పంట పొలాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని చెప్పారు. ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారంగా అందజేస్తామని అన్నారు. కౌలు రైతులకు కూడా ఈ నష్టపరిహారాన్ని వర్తింప జేస్తామని.. త్వరలోనే ఆ సాయం రైతులకు అందుతుందని కేసీఆర్ చెప్పారు.
రైతులకు ఇచ్చే దీన్ని నష్టపరిహారంగా చూడట్లేదని.. దీన్ని సహాయ పునరావాస చర్యలుగా పేర్కొంటామని కేసీఆర్ చెప్పారు. అకాల వర్షాలు, గాలి వాన, వడగండ్ల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 2.22 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించామన్నారు. రాష్ట్రంలో పంట చేతికి వచ్చే సమయంలో ఇలా నష్టపోవడం చాలా బాధాకరం అన్నారు. మొక్కజొన్న 1,29,446 ఎకరాలు, వరి 72,709 ఎకరాలు, మామిడి 8,865 ఎకరాలు.. ఇతర పంటలు 17,238 ఎకరాల్లో నష్టం జరిగినట్లు గుర్తించామని సీఎం చెప్పారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నది తెలంగాణ మాత్రమే అని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా ఇప్పుడిప్పుడే రైతులు వ్యవసాయంలో నిలదొక్కుకొని, స్థిరపడుతున్నారు. అప్పల నుంచి కూడా తేరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఇలా జరగడం బాధాకరం అన్నారు. వ్యవసాయం దండగ అని చెప్పే మూర్ఖులు ఇప్పటికీ ఉన్నారు. కొంత మంది ఆర్థిక వేత్తలు కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ.. మేం గర్వంగా చెబుతున్నాం.. ఇవాళ దేశంలో తెలంగాణ వ్యవసాయ రంగంలో నెంబర్ 1గా ఉన్నదని కేసీఆర్ తెలిపారు.
మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు కంటే అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణలో ఉన్నది. ఇప్పుడు మన తలసరి ఆదాయం రూ.3,05,000గా ఉందన్నారు. జీఎస్డీపీ పెరిగితేనే తలసరి ఆదాయం పెరుగుతుందని.. దీని పెరుగుదలలో వ్యవసాయం పాత్రే అధికంగా ఉందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ వ్యవసాయ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించిందని.. ఇది మనకు గర్వకారణమని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రైతులు నిరాశకు గురి కావొద్దని.. ఎలాంటి ఆందోళన చెందవద్దని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అందరికీ అండదండగా ఉంటుందని.. మన రాష్ట్రం వ్యవసాయ రంగంలో మరింతగా అభివృద్ధి చెందాల్సి ఉందని అన్నారు.
రైతులకు సంబంధించి దేశంలో ఒక పద్దతి, పాడు లేదని కేసీఆర్ మండిపడ్డారు. ఇప్పుడు అన్నీ ఇన్స్యూరెన్స్ కంపెనీలకు లాభం కలిగించే బీమాలే ఉన్నాయి. రైతులకు మేలు చేసే బీమాలు, కేంద్ర ప్రభుత్వ పాలసీలు ఏవీ లేవని కేసీఆర్ విమర్శించారు. మన దేశానికి ఒక అగ్రికల్చర్ పాలసీ కావాలి. ఇప్పుడు అలాంటిది ఏదీ లేదు. మేం రాసి పంపిస్తే.. వాళ్ల కమిటీ ఎప్పుడు వస్తుందో, రిపోర్టు ఎప్పుడు సిద్ధం చేస్తుందో తెలియదు. ఎంత కాలం వెయిట్ చేసినా రూపాయి రాదు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మరింత దుర్మార్గంగా ఉన్నది.
కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి రాజకీయాలు తప్ప ప్రజలు, రైతులు పట్టరు. అందుకే కేంద్రానికి లేఖ రాసి.. డబ్బు కోసం వేచి ఉండాలని అనుకోవడం లేదు. తెలంగాణకు మంచి ఆర్థిక శక్తి ఉన్నది. కాబట్టి మన రైతులను మేమే ఆదుకుంటాం. వంద శాతం మేమే ఆర్థిక సాయం చేస్తాం. కేంద్రం వరికి రూ.5,400, మొక్కజొన్నకు రూ.3.333.. మామిడి తోటలకు రూ.7,200 ఇస్తామని ఒక స్కీమ్‌లో పేర్కొన్నది. ఈ సాయం ఏ మూలకు కూడా సరిపోదు. అందుకే రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి రూ.10వేలు సాయం చేయాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు.
వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం కానివ్వమని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఉచిత కరెంట్, ఉచిత నీళ్లు ఇచ్చి.. వాటర్ సెస్ బకాయిలు రద్దు చేసి రైతులను ఆదుకున్నప్పుడే వ్యవసాయం బాగుపడుతుందని కేసీఆర్ అన్నారు. స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇతర ప్రజా ప్రతినిధులు నాకొక విజ్ఞప్తి చేశారు. కౌలు రైతులను కూడా ఆదుకోవాలని కోరారు. అందుకే డబ్బు నేరుగా రైతులకు ఇవ్వకుండా.. కౌలు రైతులను పిలిచి.. రైతుల చేతుల మీదుగానే వారికి సాయం అందిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఏ రైతూ నిరాశకు గురి కావొద్దని.. భవిష్యత్‌లో మరిన్ని మంచి పంటలు వేసే ఆలోచనలో ముందుకు వెళ్లాలని కేసీఆర్ సూచించారు.
ఖమ్మం జిల్లాలో పర్యటన ముగించుకున్న కేసీఆర్.. మహబూబాబాద్ జిల్లాకు పయనం అయ్యారు. అంతకు ముందు ఏరియల్ సర్వే ద్వారా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించారు.