అర్హులందరికీ రైతుభరోసా ఇస్తాం
ఎవరూ బాధ పడక్కర్లేదు : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
గత ప్రభుత్వం భూస్వాములకు రైతు బంధు ఇచ్చిందని, అర్హులైన రైతులు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ జిల్లా ధరూర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తపల్లి విజయ భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతుభరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందని.. కమిటీ రిపోర్టు అందగానే అర్హులందరికీ రైతుభరోసా ఇస్తామని తెలిపారు. ఎవరూ బాధ పడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని తెలిపారు. రైతుల కోరిక మేరకు సీఎం రేవంత్ రెడ్డి లగచర్లలో ఫార్మా విలేజ్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారని తెలిపారు. ఫార్మా విలేజ్‌పై ప్రతిపక్షాలు గాయి గాయి రాజకీయం చేయడం తప్ప ప్రజలకు మేలు కలగలేదన్నారు. అక్కడ ఫార్మా పరిశ్రమ వస్తే రైతుల భూములకు మంచి రేట్లు వచ్చేవని, యువతకు ఉద్యోగాలు వచ్చేవని తెలిపారు. ఇప్పడు అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఏం చేసినా అది ప్రజల మేలు కోసమేనని, అభివృద్ధిని అడ్డుకునే వారి మాటలు నమ్మొద్దన్నారు.
హామీలు అమలు చేద్దామంటే బడ్జెట్ సరిపోవడం లేదు
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు సహా అనేక హామీలిచ్చిందని.. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు తదితర హామీలను అమలు చేశామన్నారు. మిగిలిన హామీలను అమలు చేద్దాం అంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోవడం లేదని, గత ప్రభుత్వం కుప్పలు తెప్పలుగా అప్పులు చేసిందన్నారు. ఏ సంక్షేమ కార్యక్రమం చేద్దామన్నా అప్పులు, వడ్డీలే అడ్డం పడ్తున్నాయని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభం సృషించిందని, రూ. ఏడు లక్షల కోట్ల అప్పు చేసిందని, జీతాలే ఇయ్యలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతం ఇస్తున్నారని తెలిపారు. ప్రజలకు మాట ఇచ్చాం కాబట్టి హామీల అమలుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కష్టపడుతున్నారని, త్వరలోనే మిగిలిన హామీలు కూడా అమలు చేస్తారని తెలిపారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా వికారాబాద్ జిల్లాకు నీళ్లిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తాను ప్రతి గడపకు వస్తానని తెలిపారు.