రూ.లక్ష కోట్లతో పాలమూరును అభివృద్ధి చేస్తాం
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
రూ.లక్ష కోట్లతో ఉమ్మడి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు రాజేశ్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డితో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపేటలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాలను పూర్తి చేస్తామన్నారు. రైతుభరోసా సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచి ఇవ్వబోతున్నామని చెప్పారు. నిరుపేద వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు ఇస్తామని, ఈ కార్యక్రమం ఈనెల 26 నుంచి ప్రారంభమవుతుందన్నారు.
పాలమూరు ప్రాజెక్టు భూసేకరణకు 2013 చట్టాన్ని పాటించకుండా బీఆర్‌ఎస్ తుంగలో తొక్కిందని.. తమ ప్రభుత్వం నిర్వాసితులకు అండగా నిలుస్తుందన్నారు. సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభిస్తామని.. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. స్వశక్తి సంఘాల మహిళల ఆధ్వర్యంలో వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు పాడి పరిశ్రమను సద్వినియోగం చేసుకోవాలన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన సహాయ సహకరాలు అందిస్తామన్నారు. రానున్న ఐదేళ్లలో పాలమూరు జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సీఎల్పీ నేతగా పాదయాత్రకు వచ్చిన సమయంలో తాను ఇచ్చిన హామీలను ఇందిరమ్మ రాజ్యంలో పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు.