తెలంగాణ అభివృద్ధిపై కేసీఆర్‌ సంతకం

పదేళ్లలోనే పరుగులు పెట్టిన ప్రగతి.. స్టాటిస్టికల్‌ అబ్‌ స్ట్రాక్‌లో వెల్లడి చేసిన రేవంత్‌ ప్రభుత్వం

Advertisement
Update:2025-02-20 18:00 IST

పదేళ్ల పసికూన తెలంగాణ.. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో అనతికాలంలోనే దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ రోజు కేసీఆర్‌ తలపెట్టిందే రేపు దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి చేరుకున్నది. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వమే ఈ నిజాన్ని గణాంకాలతో సహా చాటిచెప్పింది. ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ''తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌ (అట్లాస్‌)'' పేరుతో రూపొందించిన నివేదికను మూడు రోజుల క్రితం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విడుదల చేశారు. కేసీఆర్‌ పదేళ్ల పాలనపై తమ ప్రభుత్వం అసెంబ్లీతో పాటు వివిధ వేదికల్లో దుమ్మెత్తి పోస్తుంటే.. దానికి పూర్తి భిన్నంగా తెలంగాణ ప్రగతి పరుగులు చాటేలా అబ్‌స్ట్రాక్‌ ఉన్నది. కేసీఆర్‌ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో పరుగులు పెట్టిందని తామే ఎందుకు ఒప్పుకోవాలని అనుకున్నారో.. తాము చేస్తున్న బూటకపు ప్రచరానికి బ్రేకులు పడుతాయని అనుకున్నారో కానీ తెలంగాణ అభివృద్ధి, ప్రగతిపై కేసీఆర్‌ సంతకానికి సాక్ష్యంగా ఉన్న స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్ ను ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌ వెబ్‌సైట్‌ నుంచి గయాబ్‌ చేశారు. కులగణన బూమరాంగ్‌ కావడంతో 2014లో కేసీఆర్‌ నిర్వహించిన సకల జనుల సర్వే నివేదికను ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ వెబ్‌సైట్‌ నుంచి మాయం చేసినట్టుగానే పదేళ్ల ప్రగతి నివేదికను ఎవ్వరికీ కనిపించకుండా చేశారు.

వ్యవసాయరంగంలో 51 శాతం మంది

తెలంగాణ జనాభాలో 1.50 కోట్ల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయని ఈ నివేదిక వెల్లడిస్తోంది. ఇందులో 51 శాతం మంది వ్యవసాయం దాని అనబంధ రంగాలు, మైనింగ్‌ రంగాల్లోనే ఉపాధి పొందుతున్నారని స్పష్టం చేసింది. 13,063 పరిశ్రమల్లో 9,11,083 మంది ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నది. రాష్ట్ర జీఎస్‌డీపీకి 24.4 శాతం ఆదాయం రియల్‌ ఎస్టేట్‌, ఐటీ ప్రొఫెషనల్స్‌, ఇతర సేవల రూపంలో సమకూరుతోంది. ట్రేడ్‌ సర్వీసెస్‌, హోటల్స్‌ రూపంలో 19.9 శాతం, వ్యవసాయ అనుబంధ రంగాలు, మైనింగ్‌ ద్వారా 17.6 శాతం, ఇతర మార్గాల్లో 12.2 శాతం, తయారీరంగం నుంచి 8.9 శాతం, ట్రాన్స్‌పోర్ట్‌, కామర్స్‌ రంగాల ద్వారా 7 శాతం, కన్‌స్ట్రక్షన్‌ రంగం ద్వారా 5.2 శాతం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రూపంలో 4.8 శాతం ఆదాయం సమకూరుతోంది.

ఆమ్దానీలోనే కాదు ఆదాయ వృద్ధిలోనూ టాప్‌

ఆమ్దానీలోనే కాదు ఆదాయ వృద్ధిలోనూ దేశం సగటు కన్నా ఎన్నో రెట్లు మెరుగైన స్థితిలో తెలంగాణ ఉన్నది. దేశ జీడీపీ 138.89 శాతం ఉంటే తెలంగాణ జీఎస్‌డీపీ 196.9 శాతంగా నమోదు అయ్యింది. దేశ తలసరి ఆదాయం రూ.1,84,205 మాత్రమే కాగా.. తెలంగాణ తలసరి ఆదాయం రెట్టింపు కన్నా ఎక్కువగా రూ.3,56,564గా ఉంది. ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రం స్పెషల్‌ కేటగిరి స్టేటస్‌ ద్వారా ఆర్థిక ప్రోత్సాహకాలు ఇచ్చిన రాష్ట్రాల మినహా ఇతర రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో తెలంగాణాను కేసీఆర్‌ దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలబెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడం, మిషన్‌ కాకతీయతో చెరువుల పునరుద్దరణ ద్వారా తెలంగాణలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 2014 -15 సంవత్సరంలో 1.31 కోట్ల ఎకరాల్లో (వానాకాలం,  యాసంగి సీజన్‌లు కలిపి) పంటలు సాగు చేస్తే 2023 -24 సంవత్సరంలో సాగు విస్తీర్ణం 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింది.. అంటే పదేళ్లలో సాగు విస్తీర్ణం 78 లక్షల ఎకరాలకు పెరిగింది. 2014 -15లో 68.17 లక్షల టన్నుల వడ్లు పండితే.. 2023 -24లో 260.88 లక్షల టన్నులకు వడ్ల దిగుబడి పెరిగింది. పత్తి దిగుబడి పదేళ్లలో 18.45 లక్షల టన్నుల నుంచి 26.34 లక్షల టన్నులకు పెరిగింది.

మూడు రెట్లు పెరిగిన కరెంట్‌ సామర్థం

తెలంగాణ కాంట్రాక్టెడ్‌ కరెంట్‌ కెపాసిటీ పదేళ్లలో మూడు రెట్లకు పైగా పెరిగిందని ఈ నివేదిక వెల్లడించింది. 2014 -15లో 7,872 మెగావాట్ల నుంచి 2023 -24 నాటికి 19,576 మెగావాట్లకు పెరిగింది. ప్రతి వెయ్యి మందికి శిశువులకు మరణాల సంఖ్య (ఎన్‌ఎంఆర్‌) 2019లో 17 ఉంటే, 2020 నాటికి 15కు తగ్గింది. ప్రతి లక్ష మంది బాలింతల్లో మరణాల రేటు (ఎంఎంఆర్‌) 2019లో 56 ఉంటే 2020 నాటికి 43కు తగ్గింది. మతాశిశు మరణాల్లో దేశం సగటుకన్నా తెలంగాణలో సగం మాత్రమే మరణాల రేటు ఉన్నది. 2024 మార్చి 31వ తేదీ నాటికి 15,61,935 మదర్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌ కిట్లు (కేసీఆర్‌ కిట్లు) పంపిణీ చేసినట్టుగా అబ్‌స్ట్రాక్ట్‌ లో పేర్కొన్నారు. పదేళ్లలో ఆరోగ్య శ్రీ పథకం కింద 20,66,614 మంది వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయించుకుంటే 2023 -24 సంవత్సరంలో 3,93,280 మంది చికిత్స చేయించుకున్నారని వెల్లడించారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, చేనేత, గీత కార్మిక, హెచ్‌ఐవీ, ఫైలేరియా, డయాలసిస్‌, ఒంటరి మహిళ, బీడీ కార్మిక పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులు 44,10,320 మంది ఉండగా 2024 -25 సంవత్సరానికి 43,00,403 మందికి తగ్గిపోయారు. పింఛన్‌ లబ్ధిదారులు ఏడాదిలో 1,09,917 మంది తగ్గిపోయారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్తగా ఒక్క పింఛన్‌ మంజూరు చేయలేదని ఈ అబ్‌ స్ట్రాక్ట్‌ సాక్షిగా తేటతెల్లమైంది. అన్నపూర్ణ, అత్యోదయ అన్నయోజన, ఫుడ్‌ సెక్యూరిటీ కార్డుల ద్వారా బియ్యం అందుకుంటున్న కుటుంబాల సంఖ్య 2023 -24లో 89,97,055 ఉంటే 2024 -25లో 89,96,337 కుటుంబాలకు తగ్గిపోయింది. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదైన కూలీల సంఖ్య 2023 -24లో 40,62,119 మంది ఉంటే 2024 -25లో 40,07,115కు తగ్గింది.

ఇతర లెక్కలు ఇలా..

2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3,50,03,674 మంది కాగా వారిలో పట్టణాల్లో 1,36,08,665 మంది గ్రామాల్లో 2,13,95,009 మంది నివసిస్తున్నారని అబ్‌స్ట్రాక్ట్‌లో పేర్కొన్నారు. ప్రతి వంద బాలురకు 988 మంది బాలికలు ఉన్నారని తెలిపారు. ములుగు జిల్లాలో ప్రతి చదరపు కి.మీ.కు 71 మంది జనసాంద్రత ఉంటే హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 18,161 మంది ఉన్నారని తెలిపారు. మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లాలో అతి తక్కువగా 8.5 శాతం గ్రామీణ ప్రాంత జనాభా ఉంటే ములుగు జిల్లాలో అత్యధికంగా 96.1 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. నారాయణపేట్‌ జిల్లాలో 92.6 శాతం, మెదక్‌లో 92.3 శాతం, మహబూబాబాద్‌ లో 90.1, భూపాలపల్లిలో 89.8, నాగర్‌ కర్నూల్‌లో 89.7, గద్వాల జిల్లాలో 89.6 శాతం జనాభా గ్రామాల్లో నివసిస్తున్నారు. హైదరాబాద్‌లో అత్యధికంగా ప్రతి వంద మందికి 83.2 శాతం, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 82.5 శాతం మంది అక్షరాస్యులు ఉంటే.. గద్వాల, నారాయణపేట జిల్లాలో 49.9 శాతం మంది అక్షరాస్యులు ఉన్నారు. మొత్తం జనాభాలో 66.5 శాతం మంది అక్షరాస్యులు. హైదరాబాద్‌ లో ఎస్సీల జనాభా 6.3 శాతం కాగా మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 9.4 శాతం మంది ఎస్సీలు ఉన్నారు. మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా 24.7 శాతం, భూపాలపల్లి జిల్లాలో 22.1 శాతం, నాగర్‌ కర్నూల్‌లో 21.4, జనగామలో 21 శాతం ఎస్సీల జనాభా ఉంది. ఎస్టీలు హైదరాబాద్‌లో 1.2 శాతం మంది ఉండగా, మహబూబాబాద్‌ లో 37.8 శాతం మంది ఉన్నారు.

రేవంత్‌ సాధించిన ప్రగతి ఇదే..

మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఎక్స్‌ప్రెస్‌, ఆర్డినరీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి 2024 మార్చి 31 నాటికి రూ.1,163.08 కోట్లు ఖర్చు చేసినట్టుగా ప్రభుత్వం అబ్ స్ట్రాక్ట్‌ లో వెల్లడించింది. తెల్లరేషన్‌ కార్డులు ఉన్న లబ్ధిదారులకు రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌లు ఇస్తున్న లబ్ధిదారుల సంఖ్య 2024 ఆగస్టు 30వ తేదీ నాటికి 42,90,127 మంది. గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు కరెంట్‌ ఉపయోగించుకునే పేద కుటుంబాలకు 2024 ఆగస్టు 31 నాటికి కరెంట్‌ బిల్లుల రూపంలో రూ.808.33 కోట్ల లబ్ధి కలిగించారు.

కేసీఆర్‌ ప్రగతిని చెరిపేసే ప్రయత్నం

పదేళ్ల పాలనతో కేసీఆర్‌ తెలంగాణ అభివృద్ధిపై తనదైన ముద్ర వేశారు. దేశమే నివ్వెరపోయి తెలంగాణ వైపు చూసేలా అద్భుతంగా తీర్చిదిద్దారు. తెలంగాణ అప్పుల పాలైందని కేసీఆర్‌ పై బురదజల్లే ప్రయత్నం చేసిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అబ్‌ స్ట్రాక్ట్‌ రూపంలో నిజాలు ఒప్పుకొని.. అంతలోనే కేసీఆర్‌ కు క్రెడిట్‌ ఇవ్వడం ఇష్టం లేక ఆ నివేదికను మాయం చేసింది. నివేదికలను మాయం చేయొచ్చేమో కానీ ప్రజల అనుభవంలో ఉన్న నిజాలను చెరిపేయడం ఎవ్వరి తరమూ కాదు.


తెలంగాణ ప్రభుత్వం ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌ వెబ్‌ సైట్‌ నుంచి తొలగించిన తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌ స్ట్రాక్ట్‌ (అట్లాస్‌) కోసం కింది లింక్‌ ను క్లిక్‌ చేయండి




Tags:    
Advertisement

Similar News