యాదగిరిగుట్ట మహోత్సవానికి సీఎం రేవంత్‌కి ఆహ్వానం
యాదగిరిగుట్ట బంగారు విమాన గోపురం మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా సీఎంను ఆహ్వానించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం బంగారు విమాన గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్ లతో పాటు ఆలయ ఈవో, అర్చకులు, జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందించారు.
ఈ నెల 23న శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానంలో బంగారు స్వర్ణ గోపురం మహా కుంభాభిషేక ప్రతిష్ఠమహోత్సవం నిర్వహించనున్నారు. వానమామలై మఠం 31వ పీఠాధిపతి రామానుజ జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ మహోత్సవం నిర్వహించనున్నారు. ఇప్పటికే గోపురానికి బంగారు తాపడం అమర్చే పనులు ఇటీవలే పూర్తి అయ్యాయి. ఇక దేశంలోనే మొట్టమొదటి ఎత్తైన స్వర్ణ గోపురంగా రికార్డుకెక్కింది. ఈ గోపురం 55 అడుగులతో, 68 కిలోల బంగారం గోపురానికి తాపడం కోసం వినియోగించారు. సుమారు రూ.70 కోట్ల వ్యయంతో స్వర్ణ తాపడం పనులు చేపట్టారు.