దళితులను ధనవంతులను చేయాలనే దళితబంధు

కేసీఆర్‌ రాబోయే తరాల కోసం ఈ పథకం తెచ్చారు.. రేవంత్‌ ప్రభుత్వానికి మానవత్వం లేదు : ఎమ్మెల్సీ కవిత

Advertisement
Update:2025-02-20 16:49 IST

దళితులను ధనవంతులను చేయాలనే కేసీఆర్‌ దళితబంధు పథకం ప్రవేశ పెట్టారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం హైదరాబాద్‌ లోని తన నివాసంలో నిర్వహించిన దళితబంధు సాధన సమితి సమావేశంలో ఆమె మాట్లాడారు. అట్టడుగు వర్గాల వారిని వేలు పట్టుకొని ముందుకు నడిపించాలన్నదే కేసీఆర్ ఆలోచన అన్నారు. పేదలు, అణగారిన వర్గాల కోసం పనిచేయాలని ఆయన ఎప్పుడూ అంటుంటారని చెప్పారు. అందరు రాజకీయ నాయకులు ఎన్నికల కోసం ఆలోచిస్తే కేసీఆర్‌ రానున్న తరాల కోసం ఆలోచిస్తారని.. ఇలా ఆలోచించి తెచ్చిందే దళితబంధు పథకమని అన్నారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి మానవత్వం లేదని.. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా దళితబంధు నిధులు ఇవ్వకుండా గోస పుచ్చుకుంటుందని అన్నారు. అయినా అంబేద్కర్‌ ను గౌరవించని ముఖ్యమంత్రి మన ఆకలిని ఎలా అర్థం చేసుకుంటారని అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ రాష్ట్ర సాధ్యమైందని.. అందుకే అంబేద్కర్‌ పై ప్రేమను చూపించడానికి 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. ఆ విగ్రహానికి రేవంత్‌ రెడ్డి కనీసం పూలదండ కూడా వేయలేదన్నారు. అంబేద్కర్‌ను ఆయన వారసులను సీఎం అవమానిస్తున్నారని అన్నారు. అంబేద్కర్‌ జయంతి రోజు కేబినెట్‌ మొత్తం వెళ్లి అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహానికి పూలదండలు వేయాలని.. లేదంటే తామే మూసేసిన గేట్లను బద్దలుకొట్టి అంబేద్కర్‌ను గౌరవించుకుంటామన్నారు.

ఎస్సీ వర్గీకరణలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదని కవిత స్పష్టం చేశారు. వర్గీకరణ విషయంలో ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని, సుప్రీం కోర్టు తీర్పు వల్ల వర్గీకరణకు బాటలు పడ్డాయని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ అసెంబ్లీలో వర్గీకరణపై తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తు చేశారు. దళితుల మధ్య పంచాయతీ పెట్టొద్దని, ఎవరికీ అన్యాయం జరగకుండా వర్గీకరణ చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. షమీమ్ అఖ్తర్ కమిషన్ నివేదికను బయటపెట్టి, వెంటనే వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ పేరు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మరో మోసం చేశారని, వర్గీకరణకు, ఉద్యోగాల కల్పనకు లింక్ పెడుతున్నారని అన్నారు. వర్గీకరణ వంకతో జాబు క్యాలెండర్ అమలును నిలిపివేయవద్దని కోరారు. కోర్టు తీర్పు వచ్చి 6 నెలలు గడిచినా ఆలూలేదు చూలు లేదన్నట్లుగా వర్గీకరణ అంశం ఉందన్నారు. రేవంత్ రెడ్డి చెప్తే నమ్మరని ఢిల్లీ నుంచి ప్రియాంకా గాంధీని తీసుకొచ్చి హామీ ఇప్పించారని, దళిత కుటుంబాలకు రూ.10 లక్షలకు బదులు రూ.12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ధ్వజమెత్తారు. రేవంత్‌ రెడ్డికి ప్రభుత్వాన్ని నడపడం చేతకావడం లేదని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సీఎం కుదేలు చేశారని అన్నారు. ఇప్పటికే కేసీఆర్ మంజూరు చేసిన దళితబంధు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మిగిలిన 18 వేల దళిత కుటుంబాలకు దళిత బంధు డబ్బులను విడుదల చేయాలని సవాలు చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందే ఈ డబ్బులు విడుదల చేయాలని అన్నారు. ఎస్సీలకు బడ్జెట్ లో రూ. 33 వేల కోట్లు కేటాయించి... కేవలం రూ 9800 కోట్లే ఖర్చు చేశారని ఎండగట్టారు. రెండు మూడేళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుందని, దళితులకు మంచి రోజులు వస్తాయని స్పష్టం చేశారు.

అట్టడుగు వర్గాలకు సరైన మార్గం చూపాలన్నదే కేసీఆర్ ఆలోచన విధానమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. దళితుల్లో పేదరికాన్ని పారద్రోలడానికి కేసీఆర్‌ సంకల్పించారని గుర్తు చేశారు. ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఇవ్వాలన్న విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని అన్నారు. దళితుల కోసం రూ.57 వేల కోట్లు ఖర్చు చేయాలని కేసీఆర్ భావించారని, ఆయన ఆలోచన అమలైతే దళిత కుటుంబాల్లో దరిద్రం ఉంటుందా ? అని అడిగారు. దళితబంధును కొనసాగించాలని డిమాండ్ చేశారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ దళితులను మోసం చేస్తూనే ఉందన్నారు. దళితబంధు సాధన సమితి ఉద్యమానికి అండగా ఉన్నందుకు ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాలని ఎమ్మెల్సీకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడు మహేష్ కోగిల, చిటిమల్ల సమ్మయ్య, మడికొండ రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News