విషాదాంతమైన విహారయాత్ర..నదిలో కొట్టుకుపోయిన మహిళా డాక్టర్
స్నేహితులతో విహారయాత్రకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన మహిళా డాక్టర్ అనన్య రావు నదిలో కొట్టుకుపోయింది.
హైదరాబాద్‌కు చెందిన లేడీ డాక్టర్ అనన్యరావు అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక హంపికి విహారయాత్రకు వెళ్లిన ఆమె సరదా తుంగ భద్ర నదిలో ఈత కొట్టేందుకు చిన్న గుట్ట మీద నుంచి దూకారు. అయితే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయారు. టి స్నేహితుల సమాచారం మేరకు అనన్య రావు కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విషయం తెలియడంతో మహిళా డాక్టర్ కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు. కాగా, 25 అడుగుల ఎత్తైన బండరాయి నుంచి అనన్యరావు నీటిలోకి దూకి ఈత కొట్టేందుకు ప్రయత్నించింది. ఈక్రమంలో ఈత కొడుతూ నీటి ఉద్ధృతికి నదిలో కొట్టుకుపోయింది.
అక్కడే ఉన్న ఆమె స్నేహితులు అనన్యను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. వెంటనే వారు పోలీసులకు, స్థానిక అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. గజ ఈతగాళ్లు, అగ్నిమాపకదళం సాయంతో యువతి కోసం నదిలో సాయంత్రం వరకూ తీవ్రంగా గాలింపు చేపట్టారు. అయినా ఆమె జాడ కానరాలేదు. తాజాగా గురువారం ఉదయం అనన్యరావు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలు వీకేసీ ఆసుపత్రిలో వైద్యురాలు అని తెలిసింది. ఆమె నదిలోకి దూకుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.