రాజలింగమూర్తి హత్యకు భూవివాదమే కారణం
నేనే చంపించానని మంత్రి కోమటిరెడ్డి అంటున్నారు. ఏ ఆధారంతో తనపై ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించిన గండ్ర
మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమంటూ కేసు వేసిన రాజలింగమూర్తి హత్యకు గురైన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఆయనను క్రూరంగా చంపేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంటకరమణారెడ్డే చంపించినట్లు మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారని చెప్పారు. న్యాయపరంగా కొట్లాడాలి కానీ.. చంపేస్తారా? అని నిలదీశారు.
మంత్రి ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంటక రమణా రెడ్డి ఖండించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాజలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన హత్యపై దుష్ప్రచారం చేస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు బాధాకరమన్నారు. హత్య కేసును ప్రభావితం చేసే ఆలోచన కనిపిస్తున్నదని అనుమానం వ్యక్తం చేశారు. ఈ హత్య కేసులో నిందితులు లొంగిపోయినట్లు మాకు సమాచారం ఉన్నది. కానీ హత్యను బీఆర్‌ఎస్‌కు అంటగట్టడానికి యత్నిస్తున్నారని మండిపడ్డారు. నాతోపాటు కేసీఆర్, హరీశ్‌రావుపైనా దుష్రచారం చేస్తున్నారు. నేనే చంపించానని మంత్రి కోమటిరెడ్డి అంటున్నారు. ఏ ఆధారంతో తనపై కోమటిరెడ్డి ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ఎప్పుడూ హత్యారాజకీయాలు ప్రోత్సహించలేదన్నారు. కాళేశ్వరం కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామన్నారు. రాజలింగమూర్తి హత్యకు నాకు, బీఆర్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదు. హత్యపై విచారణ చేసి దోషులను శిక్షించాలి. హత్యపై సీబీసీఐడీ లేదా సీబీఐతో విచారణ జరపించుకోండి అని సవాల్ విసిరారు. మృతుడి భార్య బీఆర్‌ఎస్ నుంచి కౌన్సిలర్‌గా గెలిచింది. విధానాలు నచ్చక ఆమెను పార్టీ దూరం పెట్టింది. మృతుడి భార్యతో కొందరు తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారు. రాజలింగమూర్తి అనేక భూవివాదాల్లో కూరుకుపోయాడు. ఆయన గతంలో రౌడీ షీటర్‌గా కూడా ఉన్నారు. ఆయన హత్యకు భూవివాదమే కారణం అన్నారు.
ఇక ఈ హత్యపై మీడియా సమావేశం పెట్టి గండ్ర వెంకట రమణా రెడ్డిపై ఆరోపణలు చేసిన మంత్రిని దీనికి సంబంధించి మీ ఇంటలీజెన్స్ ఏం చేస్తున్నదని మంత్రి కోమటిరెడ్డిని ప్రశ్నిస్తే బీఆర్‌ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల గురించి మాట్లాడారు. మీడియా ప్రతినిధులు ఏం అడిగారు.. మంత్రి ఏం సమాధానం చెబుతున్నారు చూస్తే అక్కడున్న వాళ్లంతా అవాక్కయ్యే పరిస్థితి నెలకొన్నది.