భూ దోపిడీపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తాం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ధరణి పోర్టల్ ను అడ్డుపెట్టుకొని సాగించిన భూ దోపిడీపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. భూ భారతి బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమాజంలోని అట్టడుగు వర్గాలు మొదలుకొని భూ యజమానులకు మేలు చేసే విధంగా విస్తృత స్ధాయిలో ప్రజాభిప్రాయ సేకరణతో 2024 భూ భారతి చట్టం రూపొందించామన్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు సీఎంగా ఉన్న సమయంలోనే భూకమతాల పరిమితి చట్టం తెచ్చారని, కౌలు రైతులకు మేలు చేసేలా రక్షిత చట్టాని హైదరాబాద్ స్టేట్ సీఎం బూర్గుల రామకృష్ణారావు తెచ్చారని, జాగీర్ల రద్దులో అప్పటి డిప్యూటీ సీఎం కొండా వెంకటరంగారెడ్డి కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. వారి అడుగు జాడల్లోనే కొత్త చట్టం తీసుకువచ్చామన్నారు. ధరణిలో సమస్యలు పరిష్కరించకపోగా అసలు సమస్యలే లేవని అప్పటి ముఖ్యమంత్రి బుకాయించే ప్రయత్నం చేశారన్నారు. రెండు పిల్లులు గొడవ పడుతుంటే తాను రొట్టె ముక్కను సమానంగా పంచి ఇస్తానని కోతి మొత్తం తినేసినట్టుగా గత ప్రభుత్వంలో పెద్దలు వ్యవహరించారన్నారు.
ధరణిలో అంతా రహస్యమే అయితే భూ భారతిలో అంతా పారదర్శకమేనన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన మద్దెల కృష్ణయ్య (73) అనే దళిత రైతు అదే గ్రామానికి చెందిన విజేందర్ రెడ్డి నుంచి 35 ఏళ్ల క్రితం 1452 సర్వే నెంబర్‌లో ఏడెకరాల భూమి కొన్నారని.. ధరణి వచ్చిన తర్వాత ఆ భూమి వేరే వాళ్ల పేరుపై పట్టాకావడంతో మనస్తాపం చెంది 2023 జనవరి 22న కృష్ణ్యయ్య ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. అలాంటి పరిస్థితి ఇందిరమ్మ రాజ్యంలో రాకుండా ఉండేలా భూ భారతి చట్టాన్ని రూపొందించామన్నారు. నాలుగు గోడల మధ్య రూపొందించిన భూభారతి చట్టానికి మూడేళ్లకే నూరేళ్లు నిండిపోయాయన్నారు. భూభారతిపై సలహాలు సూచనల కోసం పబ్లిక్ డొమైన్‌లో పెట్టామని, సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఏడు పేజీల సూచనలు ఇచ్చారని గుర్తు చేశారు.