స్వేచ్ఛకు రెక్కలు తొడిగాం.. ప్రజాస్వామ్యానికి రెడ్ కార్పెట్ పరిచాం
ఏడాది పాలనపై 'ఎక్స్' వేదికగా సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో స్వేచ్ఛకు రెక్కలు తొడిగామని.. ప్రజాస్వామినికి రెడ్ కార్పెట్ పరిచామని సీఎం రేవంత్ రెడ్డి 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. ''పోరాటాలను, ఉద్యమాలను, త్యాగాలను.. ఆత్మబలిదానాలను, ఆకాంక్షలను, ఆశయాలను.. అన్నింటినీ కలిపి వీలునామాగా రాసి.. డిసెంబర్ 7, 2023 నాడు.. తెలంగాణ నా చేతుల్లో పెట్టింది.. తన వారసత్వాన్ని సగర్వంగా.. సమున్నతంగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను అప్పగించింది.. ఆక్షణం నుండి.. జన సేవకుడిగా.. ప్రజా సంక్షేమ శ్రామికుడిగా.. మదిలో, విధిలో, నిర్ణయాల జడిలో.. సకల జనహితమే పరమావధిగా.. జాతి ఆత్మగౌరవమే ప్రాధాన్యతగా.. సహచరుల సహకారంతో.. జనహితుల ప్రోత్సాహంతో.. విమర్శలను సహిస్తూ.. విద్వేషాలను ఎదురిస్తూ.. స్వేచ్ఛకు రెక్కలు తొడిగి.. ప్రజాస్వామ్యానికి రెడ్ కార్పెట్ పరిచి.. అవనిపై అగ్ర భాగాన.. తెలంగాణను నిలిపేందుకు గొప్ప లక్ష్యాల వైపు నడుస్తూ నాలుగు కోట్ల ఆశయాలను నడిపిస్తూ నిరంతరం జ్వలించే ఈ మట్టి చైతన్యమే స్ఫూర్తిగా విరామం ఎరుగక.. విశ్రాంతి కోరక ముందుకు సాగిపోతున్నాను.. ఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తి.. సమస్త ప్రజల ఆకాంక్షలు.. సంపూర్ణంగా నెరవేర్చడమే నా సంప్రాప్తి..'' అని పేర్కొన్నారు.