కాంగ్రెస్ కు కాంగ్రెస్సే పోటీ అని నిరూపించుకున్నాం
ఆరాంఘర్ - జూపార్క్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీనే పోటీ అని నిరూపించుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆరాంఘర్ - జూపార్క్ ఫ్లై ఓవర్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వైఎస్‌ఆర్ హయాంలో 11.5 కి.మీ.ల పొడవైన పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మిస్తే.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే 4.08 కి.మీ.ల పొడవైన ఈ ఫ్లై ఓవర్ ను ప్రారంభించుకున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామని, రోడ్ల విస్తరణ, మెట్రో రైల్ నిర్మాణం, ఉపాధి అవకాశాలను ఇంకా మెరుగు పరచాల్సి ఉందని చెప్పారు. మూసీ నదికి పునరుజ్జీవం తేవాలని, ఆక్రమణలతో హైదరాబాద్ దెబ్బతింటుందని అన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కాంగ్రెస్ - ఎంఐఎం కలిసి పని చేస్తున్నాయన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు ఉంటాయని అన్నారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో బెంగళూరు హైవేలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు.
నిర్మించింది బీఆర్‌ఎస్.. చెప్పుకున్నది రేవంత్
ఆరాంఘర్ - జూపార్క్ ఫ్లై ఓవర్ ను నిర్మించింది బీఆర్‌ఎస్ ప్రభుత్వం. హైదరాబాద్ నగరంలోని రోడ్ల విస్తరణ అభివృద్ధి కోసం తలపెట్టిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా రూ.800 కోట్లతో ఈ ఫ్లై ఓవర్ నిర్మించారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటికే దాదాపు పనులు పూర్తయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే దీనిని ప్రారంభించాలని అనుకున్న పలు కారణాలతో వాయిదా పడింది. కొన్ని పెండింగ్ పనులు చేసి రేవంత్ రెడ్డి ఆ ఫ్లై ఓవర్ ను కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించిందని కలరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణానికి మాత్రమే శంకుస్థాపన చేశారు. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా వాటిని బీఆర్‌ఎస్ ప్రభుత్వమే తలపెట్టగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత పనుల టెండర్లు రద్దు చేసి కొన్ని మార్పులతో మళ్లీ ఫ్లై ఓవర్ల నిర్మాణం తలపెట్టింది. రోడ్డు విస్తరణ కోసం సర్వే, మార్కింగ్ పనులు మాత్రమే సాగుతున్నాయి. ఇవి మినహా హైదరాబాద్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పని కూడా చేపట్టలేదు.