మోదీనే లెక్క చెయ్యలే.. చిట్టినాయుడు ఎంత

సబితా ఇంద్రారెడ్డి ఫామ్‌ హౌస్‌ లు ఎక్కడున్నాయో చెప్పు.. మేమే కూలగొడ్తం : కేటీఆర్‌

Advertisement
Update:2024-10-05 15:07 IST

ప్రధాని నరేంద్రమోదీనే ఏం చేసుకుంటారో చేసుకో అని లెక్క చెయ్యనోళ్లం.. ఈ చిట్టి నాయుడు ఎంత అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో శనివారం నిర్వహించిన రైతు ధర్నాలో ఆయన మాట్లాడుతూ, సబితా ఇంద్రారెడ్డి ఫామ్‌ హౌస్‌ లు ఎక్కడ ఉన్నాయో చెప్పు.. మేమే కూలగొడుతామన్నారు. ''మా ఇండ్లను కూలగొడితే నీ కడుపు సల్ల పడుతదంటే వాటిని కూల్చు.. కానీ పేదల ఇళ్లను వదిలెయ్.. అసెంబ్లీలో సబితక్క సహా మా మహిళ ఎమ్మెల్యేలు నాలుగు గంటలు నిలబడితే కనీసం మైక్ ఇవ్వలేదు.. ఆడబిడ్డలపై కనీసం కనికరం చూపించలేదు.'' అన్నారు. తాను ఇంతవరకు అలాంటి ముఖ్యమంత్రిని చూడలేదని సబిత ఇంద్రారెడ్డి చెప్పారని గుర్తు చేశారు. ఈ ముఖ్యమంత్రి ఒక పెద్దమ్మ తిట్టిన తిట్లు చేస్తుంటే ఇదేం జన్మరా అనిపించిందన్నారు. అలాంటి తిట్లు ఇంకెవరినైనా తిట్టి ఉంటే ఎక్కడో పడి చస్తుండేవారన్నారు. ముఖ్యమంత్రికి ఏ భాషలో చెప్తో అర్థమవుతుందో అదే భాషలో మాట్లాడుతున్నానని అన్నారు.

మానం, సిగ్గు, శరం ఉన్నోన్నికి మనం మర్యాద ఇవ్వాలని, ఈ ముఖ్యమంత్రికి అలాంటివి ఏమీ లేవన్నారు. కేసీఆర్ రుణమాఫీ చేసినోళ్లు వెళ్లి రుణం తెచ్చుకుంటే డిసెంబర్ 9న మాఫీ చేస్తా అన్న రేవంత్‌ రెడ్డి పదినెలలు గడిచినా ఎందుకు రుణమాఫీ చేయలేదో చెప్పాలన్నారు. సెక్రటరియేట్ లో లంకె బిందెలు ఉన్నాయని అనుకున్న అన్నాడని, లంకె బిందెల కోసం దొంగలు కదా తిరిగేది అని ప్రశ్నించారు. కనిపించిన దేవుడి మీద ఒట్లు వేసి రైతుల రుణాలు మాఫీ చేయకుండా మోసం చేశారన్నారు. ఈ చిట్టి నాయుడు కట్టేటోడు కాదు కూలగొట్టే టోడు అన్నారు. వడ్లకు క్వింటాల్‌ కు రూ.500 బోనస్‌, ఏటా రూ.15 వేల రైతుభరోసా ఇస్తానని నమ్మించి అమలవుతున్న స్కీంలనే పత్తా లేకుండా చేశారన్నారు. ఇప్పుడు రైతుల పరిస్థితి అటూఇటూ కాకుండా పోయిందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామంటే ప్రజలు ఓట్లు వేశారని.. అధికారంలోకి వచ్చాక ఉన్న కూలగొడుతున్నాడని మండిపడ్డారు. పది నెలల్లో ఈ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని ఉంటే చెప్పాలన్నారు. రుణమాఫీకి పైసల్లేవట.. రూ.1.50 లక్షల కోట్లు మూసీలో పోస్తాడట అని మండిపడ్డారు. రూ. వేల కోట్లు దోచుకునేందుకే మూసీ ప్రక్షాళన అంటున్నారని, అది బ్యూటీఫికేషన్ కాదు లూటీఫికేషన్ అన్నారు. పేదోళ్లను కొట్టి పార్టీ పెద్దలకు కమీషన్లు పంపి సీటు కాపాడుకోవటం కోసమే మూసీ ప్రాజెక్ట్ అన్నారు. ఫార్మాసిటీ పేరు మార్చి ఫ్యూచర్ సిటీ అంటున్నాడని, ఉన్న సిటీని పట్టించుకోకుండా ఫ్యూచర్ సిటీ కడుతాడట అని ఎద్దేవా చేశారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డును కేంద్రం నిధులతో చేపట్టాలని తాము ప్రయత్నిస్తే.. లోన్లు తెచ్చి చేపట్టాలని రేవంత్‌ చూస్తున్నారని, కోమటిరెడ్డి వెంటక్‌ రెడ్డి సహా తమ వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చేందుకు రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ లా సీఎం పని చేస్తున్నాడని అన్నారు.

మూసీ గబ్బంతా ముఖ్యమంత్రి, మంత్రుల మెదళ్లలోనే ఉందన్నారు. వాళ్ల గబ్బు మాటలను ఇక నుంచి వదిలేది లేదన్నారు. తనపై అడ్డగోలు మాట్లాడిన మంత్రిని వదిలిపెట్టబోనని.. క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా కూడా వేస్తానని హెచ్చరించారు. సీఎంపైనా పరువు నష్టం దావా వేస్తానన్నారు. వాళ్లు అపోజిషన్‌ లో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా వదిలేశామని.. ఇకపై వదిలేది లేదన్నారు. తప్పు చేయకున్నా పిచ్చి మాటలతో తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. మూసీ బాధితుల గోస చూస్తుంటే బాధ అనిపిస్తోందని, 50 ఏళ్లుగా వాళ్లు కట్టిన ట్యాక్స్‌ లు దొబ్బితిని ఇప్పుడు కబ్జాదారులు అంటున్నారని మండిపడ్డారు. రెడ్డికుంటలో సీఎం ఇంటిని, దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌ లో ఉన్న ఆయన అన్న ఇంటిని ముందు కూల్చి వేయాలన్నారు. రేవంత్‌ కు పైసలు కావాలంటే నాలుగు కోట్ల మంది ప్రజల దగ్గర చందాలు వసూలు చేసి ఇస్తామని.. పేదల ఇండ్లను మాత్రం కూలగొట్టొద్దన్నారు. ప్రజల చందాలను తీసుకెళ్లి రాహుల్‌ గాంధీకి ఇచ్చి సీటు కాపాడుకోవాలని సూచించారు. ఎన్నికల నాటికి ఈ విషయాలని ప్రజలు మర్చిపోతారని రేవంత్‌ అనుకుంటున్నారని.. ప్రజలకు అన్నీ తెలుసన్నారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి రావాలని సవాల్‌ విసిరారు. చారాణా రుణమాఫీ చేసి మొత్తం అప్పులు మాఫీ చేశామని చెప్పుకోవడం ఈ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ఢిల్లీ కడుపునింపే ప్రయత్నాలపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజు త్వరలోనే వస్తుందన్నారు. కందుకూరులో మొదలైన ఈ ధర్నా రాష్ట్రం మొత్తం విస్తరిస్తుందన్నారు. ఫార్మాసిటీ కోసం 14 వేల ఎకరాలు సేకరించామని, ఆ భూములను ఫోర్త్‌ సిటీ పేరుతో తన సోదరులకు దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అది ఫోర్త్‌ సిటీ కాదు.. రేవంత్‌ ఫోర్‌ బ్రదర్స్‌ సిటీ అన్నారు. వాళ్లు మొత్తం లంగలు.. రైతులను బెదిరించి అసైన్డ్ భూములను లాక్కుంటున్నారని తెలిపారు. ఈ ప్రాంత రైతులకు బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ అండగా ఉంటుందన్నారు. ధర్నాలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News