ఈ పాపమంతా మాదే.. హిందుత్వ పేరుతో ఇదంతా మొదలుపెట్టింది మేమే... VHP నాయకుడి పశ్చాత్తాపం
హిందుత్వ పేరుతో ఈ ప్రచారం, హింస మొదలు పెట్టింది తామేనని విశ్వహిందు పరిషధ్ నాయకొడొకరుపశ్చాత్తాపం ప్రకటించారు. కర్నాటకలో బీజేవైఎమ్ కార్యకర్త హత్య నేపథ్యంలో ఆయనీ మాటలు మాట్లాడారు.
కర్నాటకలో ప్రవీణ్ నెట్టూరు అనే బీజేవైఎమ్ కార్యకర్త హత్య ఆ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆరెస్సెస్, బీజేపీ కార్యకర్తలు తమ నాయకుల మీదనే తిరగబడుతున్నారు. ఈ నేపథ్యంలో విశ్వహిందూ పరిషథ్ నాయకుడు చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనాన్ని కలిగిస్తున్నాయి.
కర్ణాటకలోని బెల్తంగడి తాలూకాలోని విశ్వహిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు 'మహేష్ శెట్టి తిమరోడి' మృతి చెందిన భారతీయ జనతా పార్టీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్ నెట్టారు కుటుంబాన్ని నిన్న పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రవీణ్ హత్యకు తమదే బాధ్యత అన్నారు. "ఈ పాపమంతా మాదే హిందూత్వం పేరుతో ఇదంతా ప్రారంభించింది మేమే" అని పేర్కొన్నాడు.
ఈ రాజకీయ నాయకుల వెనుక వెళ్లొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా యువత వినడం లేదని మహేష్ శెట్టి అన్నారు.
బీజేపీ నాయకుల గురించి పరోక్షంగా మాట్లాడుతూ "ఈ వ్యక్తుల ప్రవర్తనను చూసిన తర్వాత, మేము ఈ కార్యక్రమాలనువిడిచిపెట్టాము. లేదంటే మేము కూడా ఎప్పుడో చనిపోయి ఉండేవాళ్లం" అన్నారాయన.
హిందుత్వం పేరుతో ఇదంతా ప్రారంభించింది మేమే కాబట్టి ఏం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదని ఆయన అన్నారు.
ఈ హిందుత్వ సంస్థలకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే దాడులు జరుగుతాయని మహేష్ శెట్టి అన్నారు. "దాడి చేసేది ముస్లింలు కాదు, ఈ బీజేపీ వాళ్ళే మాపై దాడి చేస్తారు. వాళ్ల నాయకులే మాపై దాడి చేస్తారు'' అని గద్గద స్వరంతో అన్నారాయన.
తన్నులు తినడానికి అర్హులు బీజేపీ నేతలే తప్ప ఇతర మత వర్గాల ప్రజలు కాదని ఆయన అన్నారు.
"రాజకీయం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఎవ్వరి మధ్య తేడా లేదు, అందరూ ఒకటే. వారు సమాజ ప్రయోజనాల కోసం ఆలోచించడంలేదు "అని మహేష్ శెట్టి అన్నారు, "వారు మతానికి, సత్యానికి ఎప్పుడో దూరమైపోయారన్నారాయన.
కాగా హత్యకు గురైన ప్రవీణ్ నెట్టారు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS), BJYM రెండింటిలోనూ క్రియాశీల సభ్యుడు. హిందుత్వ భావజాలానికి గట్టి మద్దతుదారు.