సీఎం కేసీఆర్ ఆదేశాలతో నిజాంసాగర్ నీరు విడుదల

నిజాంసాగర్ లో ప్రస్తుతం 5 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు స్పీకర్ పోచారం. అవసరమైతే మరో 5 టీఎంసీల నీటిని కొండపోచమ్మ సాగర్ నుంచి తెప్పించి.. ఆయకట్టు కింద ఉన్న లక్షన్నర ఎకరాలకు నీరు అందించాలని సీఎం కేసీఆర్ చెప్పినట్టు వెల్లడించారు.

Advertisement
Update:2023-06-21 11:01 IST

వర్షాల జాడ కాస్త ఆలస్యం కావడంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల రైతులు ఆందోళనలో ఉన్నారు. నిజాంసాగర్ ఆయకట్టు రైతుల ఆందోళన గమనించిన స్పీకర్ పోచారం శ్రీనివాసులరెడ్డి సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే స్పందించి నీటి విడుదలకు అనుమతిచ్చారు. ఈరోజు ఉదయం 6 గంటలకు నిజాంసాగర్ నుంచి 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

నిజాంసాగర్ లో ప్రస్తుతం 5 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు స్పీకర్ పోచారం. అవసరమైతే మరో 5 టీఎంసీల నీటిని కొండపోచమ్మ సాగర్ నుంచి తెప్పించి.. ఆయకట్టు కింద ఉన్న లక్షన్నర ఎకరాలకు నీరు అందించాలని సీఎం కేసీఆర్ చెప్పినట్టు వెల్లడించారు. అడిగిన వెంటనే నీటి విడుదలకు అంగీకరించిన సీఎంకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఈ ప్రాజెక్టు ఆయకట్టు కింద నిజాంసాగర్‌, బాన్సువాడ, బీర్కూర్‌, వర్ని, నస్రుల్లాబాద్‌, కోటగిరి, చందూర్‌ మండలాల్లోని రైతులు వరి సాగుకి సిద్ధమయ్యారు. ఇప్పటికే నారుమడులు వేశారు. వరినాట్ల సమయానికి ఇబ్బంది లేకుండా చేసేందుకు తాజాగా నిజాంసాగర్ నుంచి నీరు విడుదల చేశారు. నాట్లతో పాటు మూడు తడులకు సరిపడా నీరు నిజాంసాగర్‌ లో ఉన్నందున మూడు విడుతల్లో విడుదల చేస్తామన్నారు అధికారులు.

మంజీరా పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే.. నిజాంసాగర్‌ లోకి నీరు వస్తుంది. లేకపోతే రైతులకు ఇబ్బంది లేకుండా కొండపోచమ్మ సాగర్‌ నుంచి నీరు విడుదల చేస్తారు. కాళేశ్వరం నుంచి నీటిని కొండపోచమ్మ సాగర్ కు రప్పించి, అక్కడినుంచి నిజాంసాగర్ కు తరలిస్తారు. తద్వారా రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేస్తారు. 

Tags:    
Advertisement

Similar News