కాంగ్రెస్‌లో టికెట్ల కోసం భారీ వసూళ్లు జరిగాయా?

తెలంగాణ కాంగ్రెస్‌లో రెండు, మూడు నెలల క్రితమే వసూళ్ల పర్వానికి కొంత మంది సీనియర్ నాయకులు తెరలేపినట్లు తెలుస్తున్నది.

Advertisement
Update:2023-10-05 08:50 IST

కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం రాష్ట్ర నాయకులు భారీగా డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపైనే టికట్ ఆశించిన కొత్త మనోహర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మహేశ్వరం టికెట్‌ను పారిజాత నర్సింహారెడ్డికి ఇవ్వడానికి రూ.10 కోట్లు, 5 ఎకరాల భూమి తీసుకున్నట్లు కొత్తా మనోహర్ రెడ్డి ఆరోపించారు. కాగా, ఈ వివాదం ఇలా నడుస్తుండగానే.. కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుల వ్యవహారం ఒకటి పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ కాంగ్రెస్‌లో రెండు, మూడు నెలల క్రితమే వసూళ్ల పర్వానికి కొంత మంది సీనియర్ నాయకులు తెరలేపినట్లు తెలుస్తున్నది. గతంలో ఏఐసీసీ వద్ద లాబీయింగ్ చేస్తే కాంగ్రెస్ టికెట్లు కేటాయించేది. ఈ సారి కూడా ఇలాగే జరుగుతుందని భావించిన కొంత మంది ఆశావహులు సీనియర్లను ఆశ్రయించారు. తమకు టికెట్లు ఇప్పించాలని కోరారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని టికెట్లతో పాటు దక్షిణ తెలంగాణలోని కీలక నియోజకవర్గాల్లో టికెట్ల కోసం ఆశావహులు భారీ మొత్తం చెల్లించినట్లు తెలుస్తున్నది.

కాంగ్రెస్ టికెట్ల కోసం చాలా మంది రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అడ్వాన్స్‌గా చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించే ఒక నాయకుడే టికెట్ల పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కొందరికి ఏఐసీసీ స్థాయిలో పరిచయాలు ఉన్నాయి. తరచూ ఢిల్లీ వెళ్లి అగ్ర నాయకులను కలిసి వస్తున్న ఈ నాయకులు.. తాము చెప్తే టికెట్లు వస్తాయని నమ్మబలికారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే, ఇంచార్జ్ కార్యదర్శులతో పాటు అగ్రనేతలతో చెప్పించి టికెట్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నది.

ఇలా డబ్బులు తీసుకున్న ఒక నాయకుడు స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో తమ అనుచరులకు టికెట్లు ఇప్పించడానికి తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి పూర్తిగా సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తున్నారు. గతంలో మాదిరిగా లాబీయింగ్ ద్వారా టికెట్లు ఎవరికీ కేటాయించడం లేదు. దీంతో డబ్బులు తీసుకున్న నాయకులపై అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. టికెట్ల కోసం లాబీయింగ్ ద్వారాలు మూసేయడంతో ఇప్పుడు డబ్బులు అందుకున్న నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది.

ప్రస్తుతం ఇంకా టికెట్లు ప్రకటించకపోవడంతో.. మీరు పేరు ఉంటుందని చెప్పి తప్పించుకుంటున్నారని.. రేపు అభ్యర్థుల జాబితా ప్రకటిస్తే.. ఈ నాయకుల వ్యవహారాలు బయట పడక తప్పదనే చర్చ జరుగుతోంది. డబ్బుల వ్యవహారంపై ఏఐసీసీకి కూడా ఫిర్యాదు చేయడానికి కొంత మంది ఆశావహులు సిద్ధపడినట్లు సమాచారం. లిస్టు బయటకు వచ్చిన తర్వాత తాము డబ్బులు ఇచ్చిన నాయకుల పేర్లు నేరుగా అగ్రనాయకులకే వెల్లడించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. మొత్తానికి గ్రాండ్ ఓల్డ్ పార్టీలో పాత వాసనలు ఇంకా పోలేదనే విషయం ఈ డబ్బుల వ్యవహారంతో మరోసారి బయటపడింది.

Tags:    
Advertisement

Similar News