తెలంగాణలో అడుగుపెట్టనున్న వార్నర్ బ్రదర్స్.. ఒప్పందం కుదుర్చుకున్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న వార్నర్ బ్రదర్స్ ఐడీసీ.. స్మృజనాత్మకతకు, నూతన ఆవిష్కరణలకు ఒక హబ్‌లాగా ఉండబోతోందని మంత్రి కేటీఆర్ చెప్పారు.

Advertisement
Update:2023-05-17 20:49 IST

తెలంగాణ గడ్డపైకి మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ అడుగుపెట్టనున్నది. వినోద రంగంలో ప్రపంచ అగ్రగామి అయిన వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తమ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ (ఐడీసీ)ని హైదరాబాద్‌లో నెలకొల్పనున్నది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో బుధవారం ఒప్పందం కుదుర్చుకున్నది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని రావడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. తొలి రోజే ఆయన న్యూయార్క్‌లోని 'వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ' యాజయాన్యంతో భేటీ అయ్యారు.

రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, హైదరాబాద్ కేంద్రంగా ఉన్న వినోద పరిశ్రమ గురించి కూలంకషంగా వివరించారు. దీంతో ఇక్కడ ఐడీసీని ఏర్పాటు చేయడానికి వార్నర్ బ్రదర్స్ యాజమాన్యం అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'గ్లోబల్ మీడియా పవర్ హౌస్ అయిన వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తెలంగాణ వినోద ప్రపంచంలోకి అడుగు పెడుతోందని చెప్పడానికి ఉత్సాహంగా ఉన్నాను.  హైదరాబాద్‌లో వారి అద్భుతమైన డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నారు' అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న ఐడీసీ.. స్మృజనాత్మకతకు, నూతన ఆవిష్కరణలకు ఒక హబ్‌లాగా ఉండబోతోందని మంత్రి చెప్పారు. తొలి ఏడాదిలోనే 1200 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. భవిష్యత్‌లో ఈ సెంటర్‌ను మరింతగా విస్తరించే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు.

వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ. ప్రేక్షకులకు వైవిధ్యభరితమైన కంటెంట్‌ను అందిస్తూ ఆదరణ చూరగొన్నది. టీవీ, ఫిల్మ్, స్ట్రీమింగ్, గేమింగ్ రంగాల్లో ప్రముఖ బ్రాండ్లు, ఫ్రాంచైజీలను వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ కలిగి ఉన్నది. హెచ్‌బీవో, సీఎన్ఎన్, డిస్కవరి, డిస్కవరి ప్లస్, డబ్ల్యూబీ, యూరో స్పోర్ట్, యానిమల్ ప్లానెట్, కార్టూన్ నెట్‌వర్క్, సినిమ్యాక్స్, హెచ్‌జీటీవీ, క్వెస్ట్ వంటి బ్రాండ్లు వార్నర్ బ్రదర్స్ సంస్థకు చెందినవే.

వినోదరంగంలో అగ్రగామి అయిన సంస్థతో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో వినోద, మీడియా రంగం అభివృద్ధికి ఈ ఒప్పందం కీలకంగా మారనుందని కేటీఆర్ తెలిపారు. కాగా, ఈ ఒప్పంద కార్యక్రమంలో వార్నర్ బ్రదర్స్ యాజమాన్యంతో పాటు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.

వార్నర్ బ్రదర్స్ సంస్థను ఏటీఅండ్‌టీ సంస్థ కొనుగోలు చేసిన తర్వాత.. డిస్కవరీ కంపెనీని తమలో విలీనం చేసుకున్నది. ఆ తర్వాత ఏర్పడిందే వార్నర్ బ్రదర్స్ డిస్కవరి.


Tags:    
Advertisement

Similar News