రెవెన్యూ వదిలి వెళ్లలేం.. కేటీఆర్ కి వీఆర్ఏల విన్నపం
కేటీఆర్ నేతృత్వంలో మంత్రి వర్గ ఉపసంఘంతో వీఆర్ఏలు సమావేశమై తమ బాధలు చెప్పుకున్నారు. తాము రెవెన్యూ వదిలి వెళ్లలేమంటున్నారు వీఆర్ఏలు.
వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తూ గతంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వీఆర్ఓల సర్దుబాటు పూర్తయింది కానీ, వీఆర్ఏలకు ఇంకా విధులు ఖరారు కాలేదు. అయితే ఇటీవల సీఎం కేసీఆర్, వీఆర్ఏలను కూడా ఇతర శాఖల్లో విలీనం చేయాలని నిర్ణయించారు. చర్చలకోసం కేటీఆర్ నేతృత్వంలో మంత్రి వర్గ ఉపసంఘం వేశారు. తాజాగా ఈ ఉపసంఘంతో వీఆర్ఏలు సమావేశమై తమ బాధలు చెప్పుకున్నారు. తాము రెవెన్యూ వదిలి వెళ్లలేమంటున్నారు వీఆర్ఏలు.
ఉద్యోగాల సర్దుబాటు విషయంపై గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్‌ఏ)తో మంత్రివర్గ ఉపసంఘం సంప్రదింపులు ప్రారంభించింది. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఏర్పాటైన ఉపసంఘంతో వీఆర్ఏల ప్రతినిధులు సచివాలయంలో సమావేశమయ్యారు, తమ ఇబ్బందులు చెప్పుకున్నారు. తమను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని, జూనియర్ అసిస్టెంట్ కేడర్ వేతనస్కేలు ఇవ్వాలని వారు కోరినట్లు తెలుస్తోంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకం అయిన వారితో పాటు వారసత్వంగా వీఆర్ఏలుగా కొనసాగుతున్నవారు కూడా ఉన్నారని, ఎక్కువ మంది బలహీనవర్గాల వారే ఉన్నారని ఆ సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. అన్ని అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తామని, మరోదఫా చర్చించి ముఖ్యమంత్రికి నివేదిస్తామని మంత్రుల బృందం తెలిపింది.
విద్యార్హతలను, సామర్థ్యాలను అనుసరించి నీటిపారుదల, ఇతర శాఖల్లో వీఆర్ఏలను సర్దుబాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వారం రోజుల్లోగా కసరత్తు పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని ఉపసంఘాన్ని ఆదేశించారు. అయితే వీఆర్ఏలు మాత్రం రెవెన్యూ విభాగంలోనే కొనసాగుతామంటున్నారు. దీనికి ఎలాంటి పరిష్కారం లభిస్తుందో చూడాలి.