తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో త్రీడీ పాఠాలు

ఈ ఏడాది నుంచి 5 స్కూల్స్ లో ప్రయోగాత్మకంగా వీటిని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రయోగం విజయవంతమైతే మరిన్ని VR ల్యాబ్ లను అందుబాటులోకి తెస్తారు.

Advertisement
Update:2023-04-20 11:04 IST

విద్యా వ్యవస్థలో అధునాతన మార్పులు తీసుకొస్తోంది తెలంగాణ ప్రభుత్వం. విద్యార్థుల్లో ఆసక్తి రేకెత్తించేలా, వారికి సులభంగా అర్థమయ్యేలా బోధనలో మార్పులు చేర్పులు చేస్తోంది. ఇందులో భాగంగానే రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రయోగాత్మకంగా త్రీడీ పాఠాలు మొదలు పెట్టబోతున్నారు. వర్చువల్ రియాల్టీ (VR) ల్యాబ్ లు ప్రభుత్వ స్కూళ్లలో ఏర్పాటు చేయబోతున్నారు.

ఢిల్లీలోని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(NCERT) కార్యాలయంలో ఉన్న VR ల్యాబ్‌ మోడల్ ను ఇక్కడ ప్రవేశపెట్టబోతున్నారు. ఇటీవల NCERTని సందర్శించిన తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో VR ల్యాబ్ ల ఏర్పాటుకి ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ఏడాది నుంచి 5 స్కూల్స్ లో ప్రయోగాత్మకంగా వీటిని ఏర్పాటు చేస్తారు. పరికరాల కొనుగోలు, ఉపాధ్యాయులకు శిక్షణ కోసం విద్యాశాఖ టెండర్లు కూడా ఆహ్వానించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే మరిన్ని VR ల్యాబ్ లను అందుబాటులోకి తెస్తారు.

ప్రస్తుతం హైదరాబాద్ లోని కొన్ని ఇంటర్నేషనల్‌ స్కూల్స్ లో మాత్రమే VR ల్యాబ్ లు అందుబాటులో ఉన్నాయి. పాఠశాల అడ్మిషన్ల సమయంలో తమ స్కూల్ ప్రత్యేకతల్లో భాగంగా VR ల్యాబ్ ల గురించి కూడా చెబుతుంటాయి యాజమాన్యాలు. వారానికి ఒకరోజు VR ల్యాబ్ లో పిల్లలకు పాఠాలు చెబుతారు. ఇప్పుడు అవి సర్కారు బడి పిల్లలకు కూడా అందుబాటులోకి వచ్చేస్తున్నాయనమాట.

త్రీడీ సినిమాలాగే..

VR ల్యాబ్ లో పాఠం అంటే త్రీడీ సినిమా చూసినట్టు ఉంటుంది. విద్యార్థులకు వర్చువల్‌ రియాలిటీ హెడ్‌ సెట్లు ఇస్తారు. పాఠ్యాంశాలను 3డీ రూపంలో ముందుగానే లోడ్‌ చేస్తారు. అవసరమైన పాఠ్యాంశాలను ఎంపిక చేసుకొని చూసే వెసులుబాటు ఉంటుంది. ల్యాబ్‌ కోసం ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేస్తారు. ఆ గదిలో కూర్చొని హెడ్‌ సెట్లు అమర్చుకుంటే 3డీ సినిమాల మాదిరిగానే పాఠ్యాంశాల్లోని అంశాలను వీడియోలు, బొమ్మల రూపంలో దగ్గరగా చూసే అనుభూతి కలుగుతుంది. సైన్స్, సోషల్ పాఠ్యాంశాల బోధనకు ఇది బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు ఉపాధ్యాయులు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే తెలంగాణలో ఈ ల్యాబ్ లు అందుబాటులోకి వస్తాయి. 

Tags:    
Advertisement

Similar News