వలస ఓటర్లతో గ్రామాల్లో సందడి..
రెండు మూడు రోజులుగా అడ్డాలపై కూలీలు కూడా పెద్దగా కనిపించలేదు. దాదాపుగా ఈ కూలీలంతా గ్రామాలనుంచి వలస వచ్చినవారే. వీరంతా పోలింగ్ రోజున ఊరిలో ఉండేందుకు ముందుగానే బయలుదేరి వెళ్లారు.
వలస ఓటర్లు తిరిగి సొంతూళ్లకు చేరుకుంటున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్నవారు ఈపాటికే గ్రామాలకు వచ్చేశారు. తెలంగాణలోని ఇతర నగరాల్లో ఉన్నవారు మాత్రం నిన్న, ఈరోజు ప్రయాణాలు పెట్టుకున్నారు. మొత్తానికి తరలి వస్తున్న ఓటర్లతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు అభ్యర్థులు ఏర్పాటు చేస్తున్న విందులు, వినోదాలతో సందడి నెలకొంది.
పోలింగ్ సందర్భంగా స్కూళ్లకు రెండురోజులపాటు ప్రభుత్వం సెలవలు ఇచ్చింది. ప్రైవేట్ కార్యాలయాలు కూడా సెలవలు ప్రకటించాయి. దీంతో సెలవల్లో ఊరు చూసొచ్చినట్టుకూడా ఉంటుందనే ఉద్దేశంతో వలస ఓటరు సొంత ఊరికి బయలుదేరాడు. మంగళవారం సాయంత్రం నుంచే కుటుంబ సమేతంగా ఓటర్లు ఊరికి బయలుదేరారు. హైదరాబాద్ బస్టాండ్ లలో రద్దీ పెరిగింది.
రెండు మూడు రోజులుగా అడ్డాలపై కూలీలు కూడా పెద్దగా కనిపించలేదు. దాదాపుగా ఈ కూలీలంతా గ్రామాలనుంచి వలస వచ్చినవారే. వీరంతా పోలింగ్ రోజున ఊరిలో ఉండేందుకు ముందుగానే బయలుదేరి వెళ్లారు. కొద్దిరోజులుగా అభ్యర్థులు కూడా సిటీకి వచ్చి తమ సెగ్మెంట్లలోని ఓటర్లతో ఆత్మీయ సమ్మేళనాలు సైతం నిర్వహించారు. తప్పకుండా వచ్చి ఓటుహక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణ ఖర్చులను కూడా భరిస్తామని ముందుకొచ్చారు.
హైదరాబాద్ లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందిన వారు నివసిస్తుంటారు. నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు చెందినవారు ఎక్కువగా ఎల్బీనగర్, సాగర్ రింగ్ రోడ్, బీఎన్ రెడ్డి నగర్, దిల్ సుఖ్ నగర్ ప్రాంతాల్లో ఉంటారు. ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వారు లింగంపల్లి, బాలానగర్, బోయిన్ పల్లి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో నివసిస్తుంటారు. వీరంతా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. మిగిలినవారికి కూడా ఫోన్లు చేసి మరీ అభ్యర్థుల తరపున చోటా నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. వారిని తరలించే ప్రయత్నాల్లో ఉన్నారు.