బీజేపీలో ఆధిపత్య పోరు.. వివేక్ వర్సెస్ జితేందర్ రెడ్డి

మునుగోడు ఉపఎన్నికకు జితేందర్ రెడ్డిని ఇంచార్జిగా నియమించాలని రాష్ట్ర బీజేపీలో పలువురు నాయకులు సిఫార్సు చేశారు. కానీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్.. ఆ బాధ్యతను తనకు అప్పగించాలని పట్టుబడుతున్నారు.

Advertisement
Update:2022-09-09 07:50 IST

బీజేపీలో చాలా క్రమశిక్షణ ఉంటుందని చెప్పుకుంటారు. వాస్తవానికి బీజేపీ నాయకులు చెప్పే ఆ మాట నిజమే. ఎందుకంటే బీజేపీలో చాలా మంది ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తులే ఉంటారు. ఇప్పటికీ ప్రభుత్వం, పార్టీలోని అత్యున్నత పదవుల్లో ఆర్ఎస్ఎస్ బ్యాగ్రౌండ్ ఉన్న వ్యక్తులకే ప్రాధాన్యత ఉంటుంది. అయితే, దేశంలోని ప్రతీ రాష్ట్రంలో ఆధిపత్యం చెలాయించాలని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కేంద్రంలో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ.. తమ సహజ నిబంధనలకు కాస్త సడలింపు ఇచ్చింది. కేవలం సంఘ్ పరివార్‌తో పని కాదని అంచనా వేసి.. ఇతర రాజకీయ పార్టీల నుంచి కూడా నాయకులను బీజేపీలో చేర్చుకుంటుంది. ముఖ్యంగా దక్షిణాదిలో ఈ ఫార్ములాను అమలు చేస్తోంది.

తెలంగాణలో ఆర్ఎస్ఎస్‌తో సంబంధం లేని వ్యక్తులను పార్టీలో చేర్చుకోవడానికి బీజేపీ అధినాయకత్వం మొదటి నుంచి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీల నుంచి చాలా మంది నాయకులు బీజేపీని ఓ షెల్టర్‌లా భావించి పార్టీలో చేరారు. విరుద్ద సిద్ధాంతాలు, భావాలు కలిగిన నాయకులు కూడా ఒకే గూటికి చేరారు. మొదట్లో అందరూ కలిసిమెలిసి ఉన్నట్లుగానే కనిపించినా.. తీరా పదవుల విషయం వచ్చే సరికి అసలు ప్రతాపం చూపిస్తున్నారు. తాజాగా మునుగోడు ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరపున బరిలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ బీజేపీ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఉపఎన్నికకు ఎవరు ఇంచార్జిగా ఉంటారనే విషయంలో పార్టీలో విభేదాలు నెలకొన్నట్లు తెలుస్తుంది.

తెలంగాణ అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో ఒక్క గోషామహాల్ తప్ప, ఎక్కడా బీజేపీ గెలవలేదు. అయితే దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ఆ రెండు ఉపఎన్నికల్లో జితేందర్ రెడ్డి బీజేపీ తరపున ఇంచార్జీగా ఉన్నారు. ఇక తాజగా మునుగోడు ఉపఎన్నికకు జితేందర్ రెడ్డిని ఇంచార్జిగా నియమించాలని రాష్ట్ర బీజేపీలో పలువురు నాయకులు సిఫార్సు చేశారు. కానీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్.. ఆ బాధ్యతను తనకు అప్పగించాలని పట్టుబడుతున్నారు. ఈ ఉపఎన్నిక బాధ్యతను దళిత సామాజిక వర్గానికి చెందిన తనకు ఇస్తే.. రెండు విధాలుగా పార్టీకి న్యాయం జరుగుతుందని ఆయన అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తుంది.

బీజేపీ తరపున రెడ్డి సామాజిక వర్గానికి నేత బరిలో ఉంటున్నారు. ఆయనకు సహాయంగా దళిత నేత ఉండటం వల్ల ఒక పాజిటివ్ మెసేజ్ జనాల్లోకి వెళ్తుందని వివేక్ అధిష్టానాన్ని ఒప్పించారని సమాచారం. రాజగోపాల్‌రెడ్డి కూడా వివేక్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. గతంలో ఇద్దరూ కాంగ్రెస్‌లో సన్నిహితంగా మెలిగారు. అందుకే వివేక్ అయితే మునుగోడులో అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని చెప్పినట్లు తెలుస్తుంది. పైగా వివేక్‌కు మీడియా సంస్థ కూడా ఉండటంతో మరింత బలంగా ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్లే అవకాశం ఉందని కూడా బీజేపీ నాయకత్వం భావిస్తోంది.

కాగా, సెంటిమెంట్లను ఎక్కువగా నమ్మే కొందరు బీజేపీ నాయకులు మాత్రం జితేందర్ రెడ్డి అయితేనే గెలుస్తామని అంటున్నారట. హుజూరాబాద్, దుబ్బాకలో జితేందర్ సేవలు వినియోగించుకున్న విషయాన్ని కూడా గుర్తు చేశారని తెలుస్తోంది. మొత్తానికి మునుగోడు ఇంచార్జి వ్యవహారం మాత్రం ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరును రాజేసింది. బీజేపీ మాత్రం వివేక్ వైపే మొగ్గు చూపుతోందని.. ఈ విషయంలో జితేందర్ గుర్రుగా ఉండటంతోనే ఇప్పటి వరకు ఇంచార్జిని ప్రకటించలేదని తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News