విజన్ 2050 - హైదరాబాద్ కి మరో మాస్టర్ ప్లాన్
ప్రస్తుత మాస్టర్ ప్లాన్ ను ఇప్పటి అవసరాలకు అనుగుణంగా సమూలంగా మార్చేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(HMDA) పూర్తిస్థాయి కసరత్తు చేస్తోంది. 2050 నాటికి హైదరాబాద్ లో ఎలాంటి సౌకర్యాలు ఉండాలనే విషయంపై ప్రణాళిక రూపొందిస్తోంది.
హైదరాబాద్ నగరం అనూహ్యంగా విస్తరిస్తోంది. కానీ దానికి తగ్గట్టుగా వసతులు, సౌకర్యాల కల్పన అధికారులకు తలకు మించిన భారంగా మారుతోంది. అదే సమయంలో గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో మాస్టర్ ప్లాన్ 2030 స్థానంలో ఇప్పుడు మాస్టర్ ప్లాన్ 2050ని తెరపైకి తెస్తున్నారు. ప్రస్తుత మాస్టర్ ప్లాన్ ను ఇప్పటి అవసరాలకు అనుగుణంగా సమూలంగా మార్చేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(HMDA) పూర్తిస్థాయి కసరత్తు చేస్తోంది. 2050 నాటికి హైదరాబాద్ లో ఎలాంటి సౌకర్యాలు ఉండాలనే విషయంపై ప్రణాళిక రూపొందిస్తోంది. రోడ్ల అనుసంధానం, రెసిడెన్షియల్ జోన్లు, పారిశ్రామిక జోన్లు, గ్రిడ్ రోడ్లు, గ్రీన్ జోన్లు.. ఎక్కడెక్కడ ఏవి ఎంతమేర ఉండాలనే సమాచారంతో ముసాయిదా ప్రణాళిక రూపొందించేందుకు ఒక సంస్థను ఎంపిక చేయబోతోంది. దీనికోసం ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్ ని HMDA జారీ చేసింది.
ఏడు జిల్లాల పరిధిలో హైదరాబాద్ మహానగరం విస్తరించిన ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని 2030 అవసరాల కోసం గతంలో మాస్టర్‌ప్లాన్ ను HMDA రూపకల్పన చేసింది. అప్పట్లో రెవెన్యూ మ్యాపుల ఆధారంగా ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించారు. అయితే ఈ ప్రణాళిక అమల్లోకి వచ్చాక ఇప్పటివరకు 50 వేల ఫిర్యాదులు వచ్చాయి. భూ వినియోగ మార్పిడి కోసం ప్రజలు ఇబ్బంది పడ్డారు. దీంతో ఈ మాస్టర్ ప్లాన్ ని పక్కనపెట్టి కొత్త ప్లాన్ ని రూపొందించాలని HMDA ఆలోచిస్తోంది.
ఇటీల హైదరాబాద్ వాసుల్ని కూడా వరదలు ఇబ్బంది పెట్టాయి. బెంగళూరు వంటి ఉదంతాలు కళ్లముందు కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మాస్టర్ ప్లాన్ రూపొందించబోతున్నారు. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని పక్కా ప్లానింగ్ తో దీన్ని తెరపైకి తేవాలనుకుంటున్నారు. ప్రస్తుతం పాత బల్దియా, జీహెచ్‌ఎంసీ, ఎయిర్ పోర్టు అథారిటీ, సైబరాబాద్ డెవలప్ మెంట్ అథారిటీ, విస్తరిత ప్రాంతాల అభివృద్ధి ప్లాన్-2030 అందుబాటులో ఉన్నాయి. వీటి పరిధిలో ఏవైనా భవనాలు, లేఅవుట్లు వేయాలంటే ఆయా ప్లాన్ల ప్రకారం అధికారుల వద్ద అనుమతులు తీసుకోవాలి. కొన్ని సార్లు ఒక్కో ప్రాంతం రెండు మాస్టర్ ప్లాన్ల పరిధిలోకి వస్తుండే సరికి ఇబ్బంది ఎదురవుతోంది. ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా.. మహానగరం మొత్తం ఒకటే ప్రణాళికకోసం HMDA ప్రయత్నాలు ప్రారంభించింది.