అలంపూర్‌లో ప్రోటోకాల్ రగడ.. ఎమ్మెల్యే అరెస్టు
సంపత్ కుమార్ తీరుపై ఎమ్మెల్యే విజేయుడుతో పాటు బీఆర్ఎస్ నేతలు, రైతులు ఆందోళనకు దిగారు. రైతుల కోసం సాగునీటిని విడుదల చేస్తే, కాంగ్రెస్ నేతలు గేట్లు మూసివేయడం దురదృష్టకరమన్నారు ఎమ్మెల్యే.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని తుమ్మిళ్ల లిఫ్ట్ కెనాల్ నుంచి నీటి విడుదల కార్యక్రమం రసాభాసగా మారింది. నీటి విడుదల కోసం అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడుని ఆహ్వానించారు అధికారులు. ఎమ్మెల్యే వచ్చిన తర్వాత కూడా నీరు విడుదల చేయకుండా కాంగ్రెస్ నేత సంపత్‌కుమార్ వచ్చేంత వరకు ఆగాలంటూ ఎమ్మెల్యేను కోరారు అధికారులు. అయితే ఓడిపోయిన వ్యక్తి కోసం తానెందుకు ఆగాలంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. తుమ్మిళ్ల నుంచి నీటిని విడుదల చేశారు. ఆ తర్వాత అక్కడకు వచ్చిన సంపత్ కుమార్ తాను లేకుండా నీరు ఎలా విడుదల చేస్తారంటూ అధికారులపై మండిపడ్డారు. ఆగ్రహంతో గేట్లు మూసివేశారు సంపత్ కుమార్.
సంపత్ కుమార్ తీరుపై ఎమ్మెల్యే విజేయుడుతో పాటు బీఆర్ఎస్ నేతలు, రైతులు ఆందోళనకు దిగారు. రైతుల కోసం సాగునీటిని విడుదల చేస్తే, కాంగ్రెస్ నేతలు గేట్లు మూసివేయడం దురదృష్టకరమన్నారు ఎమ్మెల్యే. అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళనకు దిగిన ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ నేతలు, రైతులను పోలీసులు అరెస్టు చేశారు.
ఇక ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం స్పందించారు. ప్రజా ప్రతినిధులను అవమానించడమేనా ప్రజా పాలనా..? అని మండిపడ్డారు. ఎమ్మెల్యే విజేయుడు పట్ల అధికారులు వ్యవహరించిన తీరును తప్పు పట్టారు కేటీఆర్. ఎన్నికల్లో ఓడిన నేతలను అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించడం వెనుక కారణం ఏంటని సీఎస్‌ను ప్రశ్నించారు. ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులను కించపరిచేలా తెలంగాణలో ప్రోటోకాల్‌ను మార్చారా అంటూ ఫైర్ అయ్యారు.