వినాయక చవితి స్పెషల్.. హైదరాబాద్ లో బేబీ పాండ్స్..
పోర్టబుల్ పాండ్స్, టెంపరరీ పాండ్స్, బేబీ పాండ్స్ అనే పేర్లతో వీటిని తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎల్బీనగర్, చార్మినార్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో మొత్తం 74 బేబీ పాండ్స్ ఏర్పాటవుతున్నాయి.
ఊరూవాడా వినాయక చవితి సంబరం కనపడుతోంది. హైదరాబాద్ లో ఈ దఫా హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు విధించడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ ని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో కలుషితం చేయకుండా దానికి ప్రత్యామ్నాయంగా నగరంలో బేబీ పాండ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ తాత్కాలిక చెరువుల్లో వినాయక ప్రతిమలు నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత అక్కడినుంచి వ్యర్థాలను తొలగిస్తారు.
మూడు రకాల కృత్రిమ చెరువులు..
పోర్టబుల్ పాండ్స్, టెంపరరీ పాండ్స్, బేబీ పాండ్స్ అనే పేర్లతో వీటిని తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎల్బీనగర్, చార్మినార్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో మొత్తం 74 బేబీ పాండ్స్ ఏర్పాటవుతున్నాయి. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్ తో ఫైబర్ రీఇన్ ఫోర్స్‌డ్ ప్లాస్టిక్ (ఎఫ్‌ఆర్‌సీ) పాండ్స్ ఏర్పాటు చేస్తున్నారు. నేలను పాక్షికంగా తవ్వి ఈ తాత్కాలిక పాండ్స్ ఏర్పాటు చేస్తున్నారు. 60 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు, నాలుగున్నర అడుగుల లోతుతో ఈ పాండ్స్ ఏర్పాటవుతున్నాయి.
మూడో రోజు నుంచే నిమజ్జనాలు..
ఈరోజు వినాయక చవితి పర్వదినం. మూడోరోజు నుంచే నిమజ్జనాలు మొదలవుతాయి. చిన్న చిన్న విగ్రహాలను, ఇంటిలో ఉంచిన విగ్రహాలను తీసుకొచ్చి నిమజ్జనం చేస్తారు భక్తులు. దీనికోసం పోర్టబుల్ పాండ్స్ పనులు వేగంగా జరుగుతున్నాయి. వివిధ కాలనీల్లో ఎఫ్‌ఆర్‌సీ పాండ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో రెండు పోర్టబుల్ పాండ్లు, ఒక తాత్కాలిక పాండ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
ఈ పాండ్స్ లో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతారు. వినాయక నిమజ్జనం కాగానే విగ్రహాలు, పూజా సామగ్రి వెంటనే తొలగించి వేరే చోటుకు తరలిస్తారు. నీరు పరిశుభ్రంగా ఉండేందుకు నిమజ్జనమయ్యే విగ్రహాల సంఖ్యను బట్టి ఎప్పటికప్పుడు తాజా నీరు నింపుతామని అధికారులు చెబుతున్నారు. ఈ పాండ్స్ లోతు నాలుగున్నర అడుగులే అయినా, విగ్రహాలను అడ్డంగా పాండ్స్ లో వేయడం ద్వారా పెద్ద విగ్రహాలు కూడా నిమజ్జనం చేయొచ్చని అంటున్నారు. వినాయక చవితికోసం ఏర్పాటు చేస్తున్న ఈ తాత్కాలిక పాండ్స్ ని.. వేసవిలో స్విమ్మింగ్ పూల్స్ గా కూడా వినియోగంలోకి తీసుకొచ్చేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు రచిస్తోంది.