తెలంగాణలో విలీనం చేయండి.. మహారాష్ట్రలో 25గ్రామాల ప్రజల డిమాండ్

ఇప్పుడు మరోసారి 25 గ్రామాల వాసులు తెలంగాణలో విలీనం చేయాలనే డిమాండ్ తో ఆందోళనకు దిగారు. మహారాష్ట్ర అభివృద్ధిలో వెనకపడిందని, తమని వెంటనే తెలంగాణలో కలపాలని కోరుతున్నారు.

Advertisement
Update:2022-11-28 19:10 IST

"రోడ్లు లేవు, తాగునీరు లేదు, ఆస్పత్రులు లేవు, సరైన సౌకర్యాలు లేవు, మమ్మల్ని పక్క రాష్ట్రంలో కలిపేయండి." సొంత రాష్ట్రం ప్రజలు ఇలా డిమాండ్ చేశారంటే ఇంతకంటే పరువు తక్కువ ఆ ప్రభుత్వానికి ఇంకోటి ఉండదు. ప్రతిపక్షాలు చేసే విమర్శలను తిప్పికొట్టొచ్చు కానీ, తమ పాలనలో ఉన్న ప్రజలు, పక్క రాష్ట్ర ప్రభుత్వం గురించి, వారి పాలన గురించి పొగిడారంటే ఆలోచించాల్సిందే. కానీ మహారాష్ట్ర సర్కారు మాత్రం దున్నపోతుపై జడివాన కురిసినట్టు సైలెంట్ గా ఉంది.

నాలుగేళ్లుగా డిమాండ్..

మేము ఈ రాష్ట్రంలో ఉండలేం బాబోయ్, మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి అంటూ నాలుగేళ్లుగా మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో 40 గ్రామాల ప్రజలు ఇదే నినాదంతో రోడ్డెక్కారు. 70ఏళ్లుగా తాము అభివృద్ధికి దూరంగా ఉండాల్సి వచ్చిందని, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అక్కడి ప్రాంతాలను అభివృద్ధి చేస్తోందని అందుకే తమని తెలంగాణలో కలపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వానికి వారు ఓ వినతిపత్రం కూడా అందించారు. సరిహద్దు జిల్లాల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా తమ అభ్యర్థనలు పంపించారు.

తాజాగా మరోసారి..

ఇప్పుడు మరోసారి 25 గ్రామాల వాసులు తెలంగాణలో విలీనం చేయాలనే డిమాండ్ తో ఆందోళనకు దిగారు. మహారాష్ట్ర అభివృద్ధిలో వెనకపడిందని, తమని వెంటనే తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. గతంలో ఎన్నోసార్లు తమ ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదని వాపోతున్నారు. పక్కరాష్ట్రంలో కలపాలనే డిమాండ్ తో అయినా మహారాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందని అనుకున్నామని, కానీ ఇప్పటి వరకూ తమ సమస్యలను ప్రభుత్వం తీర్చలేదని అంటున్నారు. మహారాష్ట్రలో తాము ఉండలేమని తెగేసి చెబుతున్నారు. మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మన్ననలు చూరగొన్న తెలంగాణలో తమని విలీనం చేయాలంటున్నారు.

Tags:    
Advertisement

Similar News