బీజేపీకి విక్రమ్ గౌడ్ రాజీనామా.. లిస్ట్ లో మరికొందరు
ఇటీవల లోక్ సభ నియోజకవర్గాలకు ఇన్ చార్జ్ లను ప్రకటించినా విక్రమ్ గౌడ్ కి అందులో స్థానం లేదు. దీంతో ఆయన బీజేపీకి రాజీనామాచేస్తున్నట్లు ప్రకటించారు. విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ లో చేరే అవకాశముంది.
అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో జంపింగ్ లు చాలానే జరిగాయి. ఇప్పుడు ఇదే సీజన్ ఏపీలో నడుస్తోంది. అయితే తెలంగాణలో కూడా లోక్ సభ ఎన్నికల దృష్ట్యా మళ్లీ జంపింగ్ సీజన్ మొదలైనట్టు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ నుంచి ఈ సీజన్ లో తొలి వికెట్ పడింది. అయితే ఇది ఊహించిన పరిణామమే. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టికెట్ రాకపోవడంతో అసంతృప్తికి లోనైన విక్రమ్ గౌడ్ ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేశారు. లోక్ సభ నియోజకవర్గాల వారీగా ఇటీవల ఇన్ చార్జిలను నియమించిన బీజేపీ తనకు మరోసారి ప్రాధాన్యత ఇవ్వలేదనేది ఆయన ఆవేదన.
మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్.. హైదరబాద్ లోని గోషామహల్ టికెట్ ఆశించారు. రాజాసింగ్ పై బీజేపీలో బహిష్కరణ వేటు కొనసాగుతన్న ఆ సమయంలో ఆ సీటు తనకేనని ఆయన ఆశపడ్డారు. కానీ సస్పెన్షన్ ఎత్తివేసి పార్టీ రాజాసింగ్ ని దగ్గర చేసుకుంది. దీంతో విక్రమ్ గౌడ్ కి అసెంబ్లీ సీటు దక్కలేదు. ఇటీవల లోక్ సభ నియోజకవర్గాలకు ఇన్ చార్జ్ లను ప్రకటించినా విక్రమ్ గౌడ్ కి అందులో స్థానం లేదు. దీంతో ఆయన పార్టీకి రాజీనామాచేస్తున్నట్లు ప్రకటించారు. విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ లో చేరే అవకాశముందని సమాచారం.
విక్రమ్‌గౌడ్ బాటలోనే మరికొందరు నేతలు బీజేపీ నుంచి కాంగ్రెస్ కి వెళ్తారనే ఊహాగానాలు వినపడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు సినీనటి జయసుధ, ఆకుల రాజేందర్ సహా పలువురు బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరే అవకాశముంది. తెలంగాణలో అధికారానికి దగ్గరకాలేకపోయినా.. సీట్లు, ఓట్లు పెంచుకుని బీజేపీ తన స్థానాన్ని కాస్త మెరుగు పరచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో గెలిచిన కమలం పార్టీ.. లోక్ సభ ఎన్నికల్లోనూ మరింత పుంజుకోవాలని చూస్తోంది. కానీ అసంతృప్తుల రాజీనామాలు పార్టీకి షాకిస్తున్నాయి.