రాజాసింగ్ బదులు విక్రమ్ గౌడ్.. గోషామహల్‌లో బీజేపీ స్ట్రాటజీ ఇదేనా?

ప్రస్తుతం బెయిల్ మీద బయటే ఉన్న రాజాసింగ్‌.. తన సస్పెన్షన్ ఎత్తివేయాలని హైకమాండ్‌ను కోరుతున్నారు.

Advertisement
Update:2023-07-19 19:35 IST

గోషామహల్ ఎమ్మెల్యే, పార్టీ నుంచి సస్పెండ్ అయిన రాజాసింగ్ విషయంలో బీజేపీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం గోషామహల్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రాజాసింగ్‌ను వచ్చే సారి అక్కడ నుంచి పోటీ చేయించే విషయంలో బీజేపీ పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తున్నది. దివంగత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌కు బీజేపీ గోషామహల్ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలతో ఒక వర్గాన్ని కించపరిచినందుకుగాను రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తెలంగాణ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు కూడా పంపారు. ప్రస్తుతం బెయిల్ మీద బయటే ఉన్న రాజాసింగ్‌.. తన సస్పెన్షన్ ఎత్తివేయాలని హైకమాండ్‌ను కోరుతున్నారు. ఎన్నికలకు మరో మూడు, నాలుగు నెలలే సమయం ఉండటంతో తన రాజకీయ భవిష్యత్‌పై ఒక నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. రాజాసింగ్ ఇంటికి వెళ్లారు. ఈ విషయంలో ఈటలపై బీజేపీ సీరియస్ అయినట్లు తెలుస్తున్నది.

సస్పెండ్ అయిన ఎమ్మెల్యే ఇంటికి వెళ్లడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఈటలకు కాస్త ఘాటుగానే హెచ్చరించినట్లు సమాచారం. రాజాసింగ్ విషయంలో రాష్ట్ర నాయకులు దూరంగా ఉండాలని.. సమయం వచ్చినప్పుడు ఆ వ్యవహారాన్ని పరిశీలిస్తామని చెప్పినట్లు తెలుస్తున్నది. మరోవైపు రాజాసింగ్‌కు ఒక ఆప్షన్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. గోషామహల్ నియోజకవర్గాన్ని వదిలేసి.. జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానంటే సస్పెన్షన్ ఎత్తేస్తామని చెప్పినట్లు చర్చ జరుగుతోంది.

గోషామహల్ సీటుపై మూళ్ల విక్రమ్ గౌడ్ కన్ను వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ముఖేష్ గౌడ్ కుమారుడే విక్రమ్ గౌడ్. ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడిగా, యూత్ కాంగ్రెస్ లీడర్‌గా విక్రమ్ గౌడ్ చాలా కాలంగా పార్టీ కోసం పని చేశారు. జీహెచ్ఎంసీ మేయర్ కావాలని విక్రమ్ కలకన్నారు. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. తండ్రి మరణించిన తర్వాత విక్రమ్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. ప్రస్తుతం బీజేపీలో క్రియాశీలకంగా పని చేస్తున్న విక్రమ్.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గోషమహల్ సీటు ఆశిస్తున్నారు.

హైదరాబాద్ లోక్‌సభ పరిధిలోని గోషామహల్ సీటును ఏఐఎంఐఎం ఎప్పుడూ గెలవలేదు. ఇక్కడ ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి.. ఇటీవల బీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తూ వస్తున్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే ఇక్కడ చాలా కాలం గెలుస్తూ వచ్చాయి. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో.. రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలు పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతాయని బీజేపీ భావిస్తోంది. అందుకే రాజాసింగ్ బదులు విక్రమ్ గౌడ్‌ను బరిలోకి దింపితే తిరిగి గెలిచే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది.

గోషామహల్‌ ఏర్పడక ముందు మహరాజ్‌గంజ్ పేరిట అసెంబ్లీ నియోజకవర్గం ఉండేది. అప్పటి నుంచే ముఖేష్ గౌడ్ ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితులు. ఆయన కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా ఈ ప్రాంతంలో ప్రభావం చూపగలిగే వ్యక్తి. పైగా ముస్లిం ఓటర్లలో కూడా వీరి కుటుంబం పట్ల సానుకూల ధోరణి ఉంది. అందుకే రాజాసింగ్‌ను ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపే విషయంలో బీజేపీ ఆసక్తి చూపించడం లేదని తెలుస్తున్నది.

Tags:    
Advertisement

Similar News