బండి సంజయ్ పై అసంతృప్తి వెళ్ళగక్కిన విజయశాంతి
బండి సంజయ్ పై విజయశాంతి అసంతృప్తి వెళ్ళగక్కారు. తనను పక్కనపెడుతున్నారని ఆమె మండిపడ్డారు. తన వల్ల కొందరు అభద్రత ఫీల్ అవుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఒంటెద్దు పోకడలపై ఇప్పటికే ఆ పార్టీలోని అనేక మంది సీనియర్లు గుర్రుగా ఉన్నారు. కొంతమందైతే ఆయనకు వ్యతిరేకంగా రహస్య సమావేశాలు కూడా నడిపారు. తాజాగా విజయశాంతి బండి సంజయ్ పై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.
తనను పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నారని, తన వల్ల కొందరు అభద్రత ఫీల్ అవుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో కూడా ఇప్పటి వరకు రాష్ట్ర నాయకులకు స్పష్టత లేదని ఆమె మండిపడ్డారు. పార్టీలో తన పాత్ర లేకుండా చేయాలని కొందరు కుట్రలు చేస్తున్నారని వారిని పాతర వేయాలని వ్యాఖ్యానించారు విజయశాంతి. ఫైర్ బ్రాండ్ నైన తనను ఎందుకు పక్కనబెట్టారో బండి సంజయ్, లక్ష్మణ్ జవాబు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
''ఏ పని చెప్పకుండా పని చేయమంటే ఏం చేయాలి? రాష్ట్ర నాయకత్వం నన్ను ఉపయోగించుకోవడంలేదు. పూర్తిగా పక్కనపెట్టేసింది. నన్ను చూసి కొందరు నాయకులకు అభద్రతాభావం నెలకొంది. నా లాంటి సీనియర్లను కలుపుకొనిపోకపోతే ఇక పార్టీ ముందుకేం పోతుంది? ఇక్కడి పరిస్థితులపై జాతీయ నాయకత్వం దృష్టి సారించాలి'' అని విజయశాంతి అన్నారు.
కొంతకాలంగా ఏ కార్యక్రమాల్లోనూ కనిపించని విజయశాంతి ఇవ్వాళ్ళ మీడియా ముఖంగా ఈ విధంగా మాట్లాడటం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. బండి సంజయ్ తీరు వల్లే విజయశాంతి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని ఆమె అభిమానులు అంటున్నారు.