రూ.250 కోట్లతో విజయ డెయిరీ కొత్త ప్లాంట్.. నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

విజయ డెయిరీ మెగా ప్లాంట్‌ రోజుకు 5 లక్షల నుంచి 8 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Advertisement
Update:2023-10-05 07:03 IST

తెలంగాణ పల్లెల్లో ఐదు విప్లవాలకు సీఎం కేసీఆర్ నాంది పలికారు. ఇందులో భాగంగా శ్వేతవిప్లవంతో రాష్ట్రంలో పాడి పరిశ్రమ, పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తి, ప్రాజెసింగ్ పెంపుదలే లక్ష్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజయ డెయిరీ ఆధ్వర్యంలో మెగా ప్లాంట్ నిర్మించారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల గ్రామపరిధి ఇమారత్ కంచ దగ్గర 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్ల వ్యయంతో ఈ భారీ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసుకున్నది. ఈ మెగా డెయిరీని పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించనున్నారు.

విజయ డెయిరీ మెగా ప్లాంట్‌ రోజుకు 5 లక్షల నుంచి 8 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు సహకారంతో దేశంలోనే అత్యాధునిక, పూర్తి స్థాయి ఆటోమేషన్ టెక్నాలజీతో దీన్ని నిర్మించారు. ఈ డెయిరీ నిర్వహణకు పూర్తిగా సోలార్ విద్యుత్‌ను వాడనుండటం గమనార్హం. అంతే కాకుండా ఇక్కడ ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను ఉపయోగించి విద్యుత్‌ను కూడా తయారు చేయనున్నారు. ఈ మెగా డెయిరీ ప్రారంభం అయిన తర్వాత రాష్ట్రంలోని సుమారు 1 లక్ష మంది పాడి రైతులకు ప్రయోజనం కలుగనున్నది.

ఈ డెయిరీలో నిత్యం 5 లక్షల నుంచి 8 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ జరుగుతుంది. రోజుకు లక్ష లీటర్ల టెట్రా బ్రిక్ పాల ప్యాకెట్ల తయారీ, 30 టన్నుల వెన్నను తయారు చేస్తారు. రోజుకు 10 టన్నుల నెయ్యిని ఉత్పత్తి చేయగల యంత్ర పరికరాలు ఈ ప్లాంటులో ఉన్నాయి. రోజుకు 5 వేల నుంచి 10 వేల లీటర్ల ఐస్‌క్రీమ్ కూడా తయారు అవుతుంది. అంతే కాకుండా రోజుకు 20 టన్నుల పెరుగును, 12 వేల లీటర్ల మజ్జిగ, లస్సీని ఇక్కడ తయరు చేయనున్నారు.

Tags:    
Advertisement

Similar News