కొత్తగూడెం ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు.. హైకోర్టు సంచలన తీర్పు

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది.

Advertisement
Update:2023-07-25 12:00 IST

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. దీంతో రెండో స్థానంలో ఉన్న జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం ఉంది. వనమా ఎంపికపై మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు హైకోర్టులో వేసిన పిటిషన్ పై ఈరోజు తుది తీర్పు వచ్చింది. వనమా ఎంపిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

కేసేంటి..?

2019లో వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఆయన చేతిలో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఓడిపోయిన జలగం వెంకట్రావు కోర్టులో కేసు వేశారు. 2014 ఎన్నికల సందర్భంగా నామినేషన్ తోపాటు వనమా దాఖలు చేసిన అఫిడవిట్‌ కు.. 2018లో సమర్పించిన అఫిడవిట్‌ కు తేడా ఉందనేది జలగం ఆరోపణ. ఆస్తులను సరిగా వెల్లడించలేదని ఆయన కోర్టుమెట్లెక్కారు. వనమాపై అనర్హత వేటు పడుతుందనే గట్టి ధీమాతో ఉన్న జలగం వర్గానికి ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఊరటనిచ్చింది.

కాకరేపిన కొత్తగూడెం రాజకీయం..

కొత్తగూడెంలో వనమా, జలగం రాజకీయ ప్రత్యర్థులు. అయితే వనమా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత బీఆర్ఎస్ లో చేరడంతో పరిస్థితులు మారిపోయాయి. కానీ జలగం మాత్రం వనమాను వదిలిపెట్టలేదు. అనర్హత పిటిషన్ వేసి వనమాను కోర్టుమెట్లెక్కించారు. ఆ తర్వాత వనమా తనయుడు రాఘవ వ్యవహారం స్థానికంగా సంచలనం రేపడంతో కొత్తగూడెం రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఈ ఏడాది తెలంగాణ ఎన్నికలు జరగాల్సిన సందర్భంలో ఇప్పుడు వనమా ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పునివ్వడం గమనార్హం. రెండో స్థానంలో ఉన్న జలగం వెంకట్రావు కొత్తగూడెం ఎమ్మెల్యే అయ్యే అవకాశాలున్నాయి. 

Tags:    
Advertisement

Similar News