ఎమ్మెల్యే అనర్హత కేసులో వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టులో మరోసారి చుక్కెదురు
ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరావు అనర్హత వేటు తీర్పుపై స్టే ఇవ్వబోమని.. ఆయన వేసిన మధ్యంతర పిటిషన్‌ను కొట్టి వేస్తున్నామని ఉన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది.
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావుకు తెలంగాణ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదని ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. అందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. వనమా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు చెప్పింది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వనమా వెంకటేశ్వరావు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని పేర్కొంటూ.. అప్పటి ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావ్ (బీఆర్ఎస్ అభ్యర్థి) హైకోర్టులో పిటిషన్ వేశారు. తప్పుడు వివరాలు వెల్లడించినందుకు వనమాను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ నెల 25న తీర్పు ఇచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమాను అనర్హుడిగా నిర్ధారిస్తూనే.. రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును 2018 డిసెంబల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రకటించింది.
కాగా, తన ఎన్నిక చెల్లదని ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తానని.. అప్పటి వరకు హైకోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ బుధవారం మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. నిన్ననే ఈ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. హైకోర్టు తీర్పు సర్టిఫైడ్ కాపీ రాలేదని, అది వచ్చాక సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని పేర్కొన్నారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసి ఇవ్వాల వెల్లడించింది. ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరావు అనర్హత వేటు తీర్పుపై స్టే ఇవ్వబోమని.. ఆయన వేసిన మధ్యంతర పిటిషన్‌ను కొట్టి వేస్తున్నామని ఉన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది.
వనమాపై హైకోర్టు అనర్హత వేటు వేసి.. జలగం వెంకట్రావ్‌ను ఎమ్మెల్యేగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జలగం బుధవారం అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు. హైకోర్టు తీర్పు కాపీలను అందించి.. వెంటనే వనమా అనర్హతపై నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. ప్రధాన ఎన్నికల అధికారిని కూడా కలిసి తీర్పు కాపీలను అందిస్తానని ఆయన పేర్కొన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని.. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.