బీసీ మీటింగ్.. పవన్ పై వీహెచ్ సీరియస్ కామెంట్స్

పవన్ కల్యాణ్ కాపు కదా, కాపులను బీసీల్లో కలిపారా..? కలుపుతారని హామీ ఇచ్చారా..? మరి మోదీ వెంట ఎందుకెళ్తున్నావ్ అంటూ సూటిగా ప్రశ్నించారు వీహెచ్.

Advertisement
Update:2023-11-07 19:11 IST

పవన్ కల్యాణ్ ని బీజేపీ తన అవసరానికి అనుగుణంగా వాడుకుంటోందని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన ఆయన, ఇప్పుడు మోదీ పక్కన ఎలా చేరారని ప్రశ్నించారు. హైదరాబాద్ లో బీసీ గర్జన పేరుతో మోదీ మరోసారి ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ కులగణనపై నోరు మెదపని మోదీకి హైదరాబాద్ లో సభ పెట్టే అర్హత లేదన్నారు వీహెచ్. అసలు బీసీలకు మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. ఆ పేరుతో మరోసారి ఓట్లకోసం ఇక్కడ సభ పెట్టారని విమర్శించారు.

పవన్ కల్యాణ్ కాపు కదా, కాపులను బీసీల్లో కలిపారా..? కలుపుతారని హామీ ఇచ్చారా..? మరి మోదీ వెంట ఎందుకెళ్తున్నావ్ అంటూ సూటిగా ప్రశ్నించారు. పవన్ సినిమాలు చూసేవాళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువ అని, ఆయన యువతకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని చెప్పారు. పవన్ కల్యాణ్ మోసపోవద్దని హితవు పలికారు వీహెచ్.

చెవిలో పువ్వు..

హైదరాబాద్ లో మోదీ పెడుతున్న సభ బీసీల చెవిలో పువ్వు అని అన్నారు వీహెచ్. బీసీలకు మేలు చేసింది, చేయబోయేది కూడా కాంగ్రెస్సేనని తెలిపారు. ఇందిరాగాంధీ హయాం నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ హయాంలోనే అని చెప్పారాయన. మోదీ ప్రైవేటీకరణకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని విమర్శించారు. అదానీ, అంబానీకోసం పనిచేస్తున్నారని చెప్పారు. ఎన్నికల కోసమే బీసీల పేరుతో రాజకీయం మొదలు పెట్టారని అన్నారు. బీసీ కుల సంఘాలు మోదీ మోసాన్ని గ్రహించాలన్నారు. 

Tags:    
Advertisement

Similar News