గాంధీ భవన్ లో క్రికెట్ మ్యాచ్ చిచ్చు.. అలిగిన వీహెచ్

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీ భవన్ కి రావడం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో చేతులు కలపడంతో ఈరోజు గాంధీ భవన్ సందడిగా మారింది. ఆ హుషారు కొనసాగుతుందనుకునే సమయంలో వీహెచ్ అలిగి వెళ్లిపోవడంతో కలకలం రేగింది.

Advertisement
Update:2023-01-20 21:23 IST

పార్టీ టికెట్ కోసం గొడవ పడ్డారంటే అర్థం చేసుకోవచ్చు, కావాల్సిన వారికి పదవి ఇప్పించుకునే విషయంలో గొడవ పడొచ్చు, అధిష్టానం దగ్గర మెప్పు పొందే విషయంలో పోటీ పడొచ్చు. కానీ సిల్లీగా క్రికెట్ మ్యాచ్ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య గొడవ జరగడం మాత్రం విశేషం. అందులోనూ అలకల మారాజు వి.హనుమంతరావు ఈజీగా మరోసారి అలిగారు. అక్కడితో ఆగలేదు, ఆయన గాంధీ భవన్ నుంచి వాకవుట్ చేశారు.

కోమటిరెడ్డి సర్దుకున్న రోజే..

కాంగ్రెస్ తో, కాంగ్రెస్ నాయకులతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సర్దుకుపోలేరు అనుకున్న స్థితిలో ఆయనే నేరుగా గాంధీ భవన్ కి రావడం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో చేతులు కలపడంతో ఈరోజు గాంధీ భవన్ సందడిగా మారింది. ఆ హుషారు కొనసాగుతుందనుకునే సమయంలో వీహెచ్ అలిగి వెళ్లిపోవడంతో కలకలం రేగింది.

గాంధీ భవన్ సాక్షిగా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో మరోసారి విబేధాలు భగ్గుమన్నాయి. కొత్త ఇన్ ఛార్జి ముందే నేతల మధ్య రచ్చ జరిగింది. వీహెచ్, మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మధ్య గొడవ జరిగింది. 22వతేదీ జరగబోయే క్రికెట్‌ టోర్నమెంట్‌ కు కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ ఛార్జి మాణిక్‌ రావ్‌ ఠాక్రేను ఆహ్వానించేందుకు వీహెచ్ గాంధీభవన్‌ కు వెళ్లారు. ఆ సమయంలో మహేష్‌ గౌడ్‌ అడ్డుతగిలారు. వీహెచ్ ఆహ్వానం ఇచ్చిన తర్వాత 22న ఇన్ చార్జ్ ఠాక్రే షెడ్యూల్ ఖాళీగా లేదని మహేష్ గౌడ్ బదులిచ్చారు. దీంతో వీహెచ్ కి కోపం వచ్చింది. ఠాక్రే సాబ్ వస్తానంటే మధ్యలో వీల్లేదు అని చెప్పడానికి నువ్వెవరు అంటూ ఆయన పైర్ అయ్యారు. రుసరుసలాడుతూ బయటకు వచ్చేశారు. ఎవరికి వారే ఇక్కడ బాస్ లు అనుకుంటూ వెళ్లిపోయారు. వీహెచ్ అలిగిపోవడంతో కొత్త ఇన్ చార్జ్ ఠాక్రే కూడా షాకయ్యారు. కానీ అక్కడున్న నాయకులు.. ఇది తమకు అలవాటేనంటూ సర్దిచెప్పుకున్నారు. 

Tags:    
Advertisement

Similar News