రుణమాఫీతో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్.. ఉత్తమ్ వ్యాఖ్యల కలకలం

రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ తప్పుల్ని ఎవరూ ఎత్తి చూపాల్సిన అవసరం లేకుండా, నేతలు తమ పరువు తామే తీసుకుంటున్నారు. లెక్కలు తెలియకుండా, సరైన కారణాలు చెప్పలేక, కవర్ చేసుకోలేక చతికిల పడ్డారు.

Advertisement
Update:2024-08-20 08:38 IST

తెలంగాణలో రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సెల్ఫ్ గోల్ వేసుకుంది. రుణమాఫీపై ఏ ఇద్దరు కాంగ్రెస్ నాయకులు, వారు మంత్రులయినా సరే ఒకే రకంగా మాట్లాడటం లేదు. రుణమాఫీ చేసి తమ మాట నిలబెట్టుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘనంగా ప్రకటించుకున్నాారు. అయితే రుణమాఫీ పూర్తిగా చేయలేదని మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా ఒప్పుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 17.14 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉందని స్పష్టం చేశారు.

కామెడీగా కారణాలు..

గతంలో చాలా ప్రభుత్వాలు రైతులకు రుణాలు మాఫీ చేశాయి. కానీ కాంగ్రెస్ ఇప్పుడు చెబుతున్న కారణాలు మాత్రం కాస్త కామెడీగా ఉన్నాయి. రాష్ట్రంలో లక్షా 20వేల మందికి ఆధార్ నెంబర్లు తప్పుగా నమోదవడం వల్ల వారికి రుణమాఫీ కాలేదంటున్నారు మంత్రి ఉత్తమ్. ఆధార్ లో 12 నెంబర్లు ఉండాలి కానీ కొంతమందికి 11 లేదా 13 నెంబర్లు ఆధార్ స్థానంలో నమోదయ్యాయని, అందుకే వారికి రుణ మాఫీ కాలేదన్నారు. లక్షా 61వేల మందికి ఆధార్ కార్డులో పేరు, లోన్ అకౌంట్లో పేరు వేరువేరుగా ఉన్నాయని చెప్పారు. 4 లక్షల 83 వేల మందికి రేషన్ కార్డులు లేవని అందుకే రుణమాఫీ కాలేదంటున్నారు.


మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రుణ మాఫీ లెక్కల్నే మార్చి చెబుతున్నారు. ఏకంగా వెయ్యి కోట్లకు పైగా ఆయన లెక్కల్లో తప్పులు చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం రూ.17,933 కోట్లు రుణమాఫీకోసం విడుదలయ్యాయి. అయితే ఐఅండ్ పీఆర్ మంత్రిగా ఉన్న పొంగులేటి మాత్రం రూ.19 వేల కోట్లు రుణ మాఫీకోసం విడుదలయ్యాయని చెప్పడం విశేషం.


రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ తప్పుల్ని ఎవరూ ఎత్తి చూపాల్సిన అవసరం లేకుండా, నేతలు తమ పరువు తామే తీసుకుంటున్నారు. లెక్కలు తెలియకుండా, సరైన కారణాలు చెప్పలేక కవర్ చేసుకోలేక చతికిల పడ్డారు. స్పెషల్ డ్రైవ్ అంటూ రైతుల్ని బుజ్జగించాలని చూస్తున్నా ఫలితం లేదు. ఇప్పటికే చాలా డ్యామేజీ జరిగింది. ఇకనైనా ప్రభుత్వం ఈ విషయంపై సీరియస్ గా ఫోకస్ పెడుతుందేమోచూడాలి.

Tags:    
Advertisement

Similar News