ఉప్పల్ స్కైవాక్.. దీని ప్రత్యేకతలు ఏంటంటే..?
ఉప్పల్ స్కైవాక్ కు ఆరు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వందేళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా పటిష్టంగా దీన్ని నిర్మించారు. 40 శాతం మాత్రమే రూఫ్ కవరింగ్ ఏర్పాటు ఉంటుంది. మిగతాభాగమంతా స్వచ్ఛమైన గాలి వెలుతురు ప్రసరించేలా ఉంటుంది.
ఉప్పల్ చౌరస్తాలో వాహనాల రద్దీ మధ్య రోడ్డు దాటడమంటే అదో గొప్ప సాహసం అనే చెప్పాలి. ప్రతి రోజూ ఇక్కడ 20నుంచి 25వేలమంది వరకు రోడ్డు దాటుతుంటారని అంచనా, ప్రమాదాలు కూడా ఎక్కువే. ఉప్పల్ లో రోడ్డుదాటడానికి ఇబ్బందిపడే స్థానికులు, ప్రయాణికులకు ఇది ఓ గుడ్ న్యూస్.
ఉప్పల్ స్కైవాక్ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రజలకు త్వరలో అందుబాటులోకి రాబోతోంది. ఇకపై ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద పాదచారులకు కష్టం ఉండదు, అదే సమయంలో వాహనదారులకు కూడా పాదచారులతో ఇబ్బంది ఉండదు. మంత్రి కేటీఆర్ చొరవతో ఇక్కడ హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ స్కైవాక్ రూపకల్పన చేసింది. 25కోట్ల రూపాయల ఖర్చుతో దీన్ని నిర్మించారు.
మెట్రో ప్రయాణికులకు కూడా..
కేవలం పాదచారులే కాదు, మెట్రో ప్రయాణికులు కూడా ఏవైపు నుంచయినా స్కైవాక్ ద్వారా రైల్వే స్టేషన్ కి చేరుకోవచ్చు. మెట్రో దిగిన తర్వాత నేరుగా తాము వెళ్లాల్సిన వైపు బస్టాండ్ వరకు స్కైవాక్ ద్వారా చేరుకోవచ్చు. స్కైవాక్ లో 8 లిఫ్టులు, 6 చోట్ల మెట్లు, 4 ఎస్కలేటర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్కైవాక్ మొత్తం పొడవు 660 మీటర్లు. భూమి నుండి 6 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. వెయ్యి టన్నుల స్ట్రక్చరల్ స్టీల్ ఈ స్కైవాక్ నిర్మాణంలో ఉపయోగించారు.
వందేళ్లపాటు చెక్కుచెదరకుండా పటిష్టంగా దీన్ని నిర్మించారు. 40 శాతం మాత్రమే రూఫ్ కవరింగ్ ఏర్పాటు ఉంటుంది. మిగతాభాగమంతా స్వచ్ఛమైన గాలి వెలుతురు ప్రసరించేలా ఉంటుంది. ఈ స్కైవాక్ ను మంత్రి కేటీఆర్ త్వరలో ప్రారంభిస్తారు.
స్కైవాక్ కు ఆరు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. నాగోల్ రోడ్డు, రామంతాపూర్ రోడ్డు, జీహెచ్ఎంసీ థీమ్ పార్క్, జీహెచ్ఎంసీ ఆఫీసు సమీపంలోని వరంగల్ బస్టాప్, ఉప్పల్ పోలీసు స్టేషన్, ఉప్పల్ ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ఎదురుగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. మెట్ల పరిసరాల్లో హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో మొక్కలతో అందమైన పచ్చిక బయళ్లు ఏర్పాటు చేశారు. దీంతో స్కైవాక్ పరిసర ప్రాంతాలు సుందరంగా మారిపోయాయి.