ధరణి అధ్యయనానికి యూపీ బృందం..

తెలంగాణలో ధరణికి ముందు, తర్వాత వచ్చిన మార్పులపై యూపీ బృందం అధ్యయనం చేస్తోంది. ధరణితో భూ రికార్డుల ప్రక్షాళన ఫలితాలు, భూయజమానులకు కలిగిన ప్రయోజనాలను సీసీఎల్‌ఏ నుంచి అడిగి తెలుసుకున్నారు యూపీ అధికారులు.

Advertisement
Update:2023-09-16 10:21 IST

భూరికార్డుల ప్రక్షాళనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. తమ రాష్ట్రంలో కూడా భూ వివాదాల పరిష్కరణకోసం ధరణిలాంటి వ్యవస్థ తీసుకొచ్చేందుకు యూపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర రెవెన్యూశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుధీర్‌ గార్గ్‌ నేతృత్వంలోని అధికారుల బృందం ధరణిపై అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ వచ్చింది. తెలంగాణ సీసీఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ తో భేటీ అయింది. రాష్ట్రంలో ధరణి అమలు తీరును అక్కడి అధికారులు అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణలో విజయవంతంగా అమలవుతున్న పథకాలు, కొత్త వ్యవస్థలను ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. తెలంగాణలో ఐటీ అభివృద్ధి పరిశీలనకు ఇటీవల తమిళనాడు ఐటీ మంత్రి నేతృత్వంలో ఓ బృందం వచ్చి అధ్యయనం చేసి వెళ్లింది. తెలంగాణలో వైద్య వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు, మార్పులు విదేశీ బృందాలను సైతం ఆకర్షిస్తున్నాయి. తాజాగా ధరణి విషయంలో కూడా ఇతర రాష్ట్రాలు ఆసక్తి చూపిస్తున్నాయి.

ధరణి విజయవంతం అయిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది, అదే సమయంలో ధరణితో తమ కష్టాలు తీరిపోయాయని రైతన్నలు ధీమాగా చెబుతున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ధరణిపై ఆరోపణలు చేస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ దశలో ధరణి అధ్యయనానికి యూపీబృందం రావడం విశేషం.

తెలంగాణలో ధరణికి ముందు, తర్వాత వచ్చినమార్పులపై యూపీ బృందం అధ్యయనం చేస్తోంది. ధరణితో భూ రికార్డుల ప్రక్షాళన ఫలితాలు, భూయజమానులకు కలిగిన ప్రయోజనాలను సీసీఎల్‌ఏ నుంచి అడిగి తెలుసుకున్నారు యూపీ అధికారులు. భూక్రయవిక్రయాల విధానాన్ని, మ్యుటేషన్‌ జరిగే పద్ధతిని చూసి యూపీ బృందం ఆశ్చర్యపోయింది. ఎలాంటి రికార్డులు, దరఖాస్తు దస్తావేజుల అవసరం లేకుండానే ధరణి ద్వారా జరుగుతున్న మ్యుటేషన్‌ తీరుపై ఆ బృందం ప్రత్యేక ఆసక్తిని కనబరచినట్టు తెలుస్తోంది. ఈరోజుతో ఈ అధ్యయనం ముగుస్తుంది. 

Tags:    
Advertisement

Similar News