రైతుల కోసం తెలంగాణలో అమలవుతున్న‌ పథకాలను చూసి ముగ్ధులవుతున్న యూపీ కూలీలు

24 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయ పొలాలకు సరిపడా నీరు ఇక్కడి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ఉత్తరప్రదేశ్‌లో అలాంటి పథకాలేవీ అమలు కావడం లేదంటున్నారు యూపీ నుంచి తెలంగాణకు వచ్చిన కూలీలు.

Advertisement
Update:2023-01-13 08:56 IST

రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున వరిపొలాల్లో పని చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీలు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి కల్పిస్తున్న సంక్షేమ పథకాలు, సౌకర్యాలను చూసి ముగ్ధులవుతున్నారు.

24 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయ పొలాలకు సరిపడా నీరు ఇక్కడి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ఉత్తరప్రదేశ్‌లో అలాంటి పథకాలేవీ అమలు కావడం లేదంటున్నారు.

యుపిలోని పిలిభిత్ జిల్లా నియోరియా హుస్సేన్‌పూర్‌లోని తనక్‌పూర్ రోడ్డుకు చెందిన 13 మంది సభ్యుల బృందం గత కొన్ని వారాలుగా కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వరిపొలాల్లో పనులు చేస్తున్నారు. వారిలో ఒకరైన అషిద్ బైరాగి మాట్లాడుతూ, తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా తాము వరి పొలాల్లో పనిచేశామని చెప్పారు. ఒక్క యూపీ మాత్రమే కాదు, మరే రాష్ట్రం కూడా రైతుల సంక్షేమం కోసం ఇలాంటి పథకాలను అమలు చేయడం లేదని అన్నారు.

యుపిలో తక్కువ విస్తీర్ణంలో వరి పండించడం వల్ల వారికి పెద్దగా పని లభించడం లేదు. అందుకే వారు జీవనోపాధి కోసం తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళవలసి వస్తోంది. అంతేకాదు తెలంగాణలో వారు రెట్టింపు ఆదాయం పొందుతున్నారు. యూపీలో రోజుకు రూ.350 మాత్రమే లభిస్తుందని, తెలంగాణలో రోజుకు రూ.600 లభిస్తున్నదని బైరాగి చెప్పారు.

గోలక్ మండల్ అనే మరో కార్మికుడు మాట్లాడుతూ గతంలో తాము తరచూ ఏపీకి వెళ్లేవారమ‌ని, నాలుగేళ్లుగా తెలంగాణకు వస్తున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రభుత్వం తెలంగాణలో రైతులకు మరిన్ని ఎక్కువ సౌకర్యాలు కల్పిస్తోంద‌ని చెప్పారు.

అంతే కాకుండా రాష్ట్రంలో వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉందని, ప్రజలు స్నేహపూర్వకంగా ఉన్నారని, పని కోసం రాష్ట్రంలో మూడు నెలల పాటు ఉంటామని మండల్ తెలిపారు.

ఇదిలావుండగా, స్థానిక ఏజెంట్లు ఇక్కడ వరి పొలాల్లో పని చేసేందుకు యుపి, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుండి కూలీలను తీసుకవస్తున్నారు. ఉండడానికి ఇల్లు, వంటగ్యాస్‌, బియ్యంతో పాటు ఎకరం పొలంలో వరి నాట్లు వేసేందుకు ఒక్కో బృందానికి రూ.3,500 నుంచి రూ.4,500 వరకు కూలీలకు ఇస్తున్నారు. ఒక్కో బృందం ప్రతిరోజు నాలుగైదు ఎకరాల్లో పనిచేస్తుండగా, కూలీల నుంచి ఎకరానికి రూ.900 నుంచి రూ.1000 వరకు కమీషన్ గా ఏజెంట్లు వసూలు చేస్తున్నారు.

తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీకి చెందిన రైతు గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎకరం పొలంలో వరి నాట్లు వేయడానికి స్థానిక కూలీలు రూ.5,800 వసూలు చేస్తున్నారని, వలస కార్మికులు అదే పనిని చాలా తక్కువ ధరలకు చేస్తున్నారని అన్నారు..

Tags:    
Advertisement

Similar News