జేపీ నడ్డాకు సమాధి! ఇదేమి రాజకీయం అంటున్న కమలం!
ఎన్నికల్లో ఓట్ల కోసం ఇంతగా దిగజారుతారా? అంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు.
మునుగోడు ఉప ఎన్నికల హీట్ పెరిగింది. ఒక వైపు పోస్టర్ల వార్ నడుస్తోంది. మరో వైపు మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇలాంటి మధ్యలో రాజకీయంగా ఉన్న హద్దులు దాటి కొందరు ప్రవర్తించడం ఇప్పుడు చర్చగా మారింది.
చౌటుప్పల్‌మండలం దండుమల్కాపురంలో జేపీ నడ్డాకు గుర్తు తెలియని వ్యక్తులు సమాధి కట్టారు, మట్టితో సమాధి ఏర్పాటు చేసి.. ఆ సమాధిపై జేపీ నడ్డా ఫొటో పెట్టారు, పూలమాల వేసి కుంకుమ చల్లారు. ఫొటో పోస్టర్‌లో రీజనల్ ఫ్లోరైడ్ మిటిగేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ చౌటుప్పల్ అని రాసి పెట్టారు.
మునుగోడుకు ప్రాంతీయ ప్లోరైడ రీసెర్చ్ సెంటర్ ఇవ్వనందుకు దుండగులు ఇలా నిరసన తెలిపినట్లు తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటైమ్‌లో 2016 మునుగోడులోని మర్రిగూడలో పర్యటించారు. ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఇక్కడ రీజనల్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకూ నెరవేర్చలేదని ఇలా నిరసన వ్యక్తం చేశారు.
అయితే ఎన్నికల్లో ఓట్ల కోసం ఇంతగా దిగజారుతారా? అంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడికి సమాధి కట్టి ఏం సాధిస్తారు? టీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిపోతామని భయపడుతుందని ఎద్దేవా చేశారు. సమాధి కట్టినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.