హైదరాబాద్‌లో పెరుగుతున్న టైఫాయిడ్ కేసులు.. కారణాలు వెల్లడించిన డాక్టర్లు

ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్యను చూసి ఆందోళన చెందవలసిన అవసరం లేదని డాక్టర్ శంకర్ అన్నారు.

Advertisement
Update:2023-06-20 16:17 IST

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో టైఫాయిడ్ కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. టైఫాయిడ్ జ్వరాలు సోకే సీజన్ కాకపోయినా.. ప్రతీ రోజు ఆ కేసులు వస్తుండటం పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. నగరంలోని బంజారాహిల్స్, మెహదీపట్నం, టోలీచౌకి, హఫీజ్‌పేట్ వంటి ప్రాంతాల్లో టైఫాయిడ్ కేసులు నమోదైనట్లు తెలుస్తున్నది. ప్రతీ రోజు ఒకటి, రెండు టైఫాయిడ్ కేసులు వస్తున్నట్లు ప్రైవేట్ డాక్టర్లు తెలియజేశారు. ప్రభుత్వ ఫివర్ ఆసుపత్రిలో కూడా రోజుకు రెండు, మూడు కేసులను డయోగ్నైజ్ చేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు.

ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్యను చూసి ఆందోళన చెందవలసిన అవసరం లేదని డాక్టర్ శంకర్ అన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో టైఫాయిడ్ అకస్మాతుగా వ్యాపించే పరిస్థితులు లేవన్నారు. ఫివర్ ఆసుపత్రికి మామూలు జ్వరంతో వచ్చే రోగుల సంఖ్య కూడా తగ్గిందని చెప్పారు. గతంలో రోజుకు 1200 కేసులు నమోదవగా.. ప్రస్తుతం 300 లోపు పేషెంట్లే వస్తున్నారని.. వారిలో రెండు మూడు కేసులు టైఫాయిడ్‌గా నమోదవుతున్నాయని చెప్పారు.

సాధారణంగా వర్షాలు మొదలయ్యే జూలై నుంచి సెప్టెంబర్ నెల వరకు టైఫాయిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతాయి. వానాకాలంలో ఈగల సంఖ్య విపరీతంగా పెరగడం వల్ల ఈ వ్యాధి త్వరగా వ్యాపిస్తుంది. అయితే ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో కూడా టైఫాయిడ్ కేసులు నమోదు కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయని ఇన్ఫెక్టియస్ డిసీజెస్ కన్సల్టెంట్ డాక్టర్ మోనాలిసా సాహు తెలిపారు. బయటి ఫుడ్ ఎక్కువగా తినడం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోక పోవడం వల్ల టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు.

సాధారణంగా తొలకరి తర్వాత రెండు వారాలకు గాని టైఫాయిడ్ కేసులు బయటపడుతుంటాయి. కానీ ఈ సారి ఎండాకాలంలోనే కేసులు నమోదు కావడానికి అపరిశుభ్ర ఆహారం, పరిసరాలే కారణమని చెప్పారు. టైఫాయిడ్‌లో రెండు రకాలు ఉంటాయి. జ్వరంతో పాటు గ్యాట్రిక్ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. కొందరిలో కేవలం టైఫాయిడ్ జ్వరం మాత్రమే ఉంటుంది. ఇటీవల కాలంలో గ్యాస్ట్రిక్ సంబంధిత జ్వరాలు ఎక్కువగా నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోందని వైద్యులు తెలిపారు.

ఒక సారి టైఫాయిడ్ సోకితే రోగి పూర్తి అప్రమత్తతో ఉండాలి. సరైన వైద్యం చేయించుకోక పోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే సాధ్యమైనంత త్వరగా టెస్టులు చేయించుకోవడం మంచిదని కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ రాహుల్ అగర్వాల్ అన్నారు. ఇప్పటి వరకు నమోదైన టైఫాయిడ్ కేసులు అన్నీ హైదరాబాద్ స్లమ్ ఏరియాల్లో నుంచి వచ్చినవే అని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అయితే, వారికి సాధారణ టైఫాయిడ్ మాత్రమే వచ్చిందని.. అందరినీ డే కేర్‌లోనే ట్రీట్ చేసి పంపిస్తున్నామనన్నారు. అయితే, టైఫాయిడ్ కేసులు ప్రతీ రోజు నమోదువుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని.. బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News